గోల్కొండకోటలో ట్రంప్ కుమార్తె?

నవంబర్ 28 నుంచి 30వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్ లో గ్లోబల్ ఎంటర్ప్రీన్యూర్ షిప్ సమ్మిట్ సమావేశాలు జరుగబోతున్నాయి. వీటికి దేశవిదేశాలకు చెందిన వివిధ సంస్థల ప్రతినిధులతోబాటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కూడా హాజరుకాబోతున్నారు. కనుక ఈ సందర్భంగా వారందరికీ తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలు, వారసత్వ సంపద గురించి చాటిచెప్పేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ గోల్కొండ కోటలో నవంబర్ 29వ తేదీ రాత్రి విందు ఏర్పాటు చేయబోతున్నారు. గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనబోయే 1400 మంది అతిధులను ఈ విందు కార్యక్రమానికి ఆహ్వానించబోతున్నారు. కానీ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి ఇవాంకా ట్రంప్ అని వేరే చెప్పనవసరం లేదు. 

కనుక హైదరాబాద్ వెస్ట్ జోన్ డిసిపి ఏ వెంకటేశ్వర రావు, డిసిపి (ట్రాఫిక్) ఏవి రంగనాథ్, ఇంకా మరికొందరు పోలీస్ అధికారులు గోల్కొండ కోటలో నిన్న సమావేశమయ్యి భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్ల గురించి చర్చించారు. నవంబర్ 28,29 తేదీలలో సందర్శకులను గోల్కొండ కోట, దాని పరిసర ప్రాంతాలలోకి అనుమతించకూడదని నిర్ణయించారు. అమెరికన్ సీక్రెట్ సర్వీస్ అధికారులు గోల్కొండకోట లోపల, చుట్టుపక్కల ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి క్లియరెన్స్ ఇచ్చిన తరువాతే ఇవాంకా ట్రంప్ ఈ విందుకు హాజరవుతారు.