రేవంత్ రెడ్డి తెదేపాకు గుడ్ బై చెప్పి వెళ్ళిపోయిన తరువాత నుంచి ఆ పార్టీకి చెందిన అనేకమంది ద్వితీయశ్రేణి నేతలు, వారి అనుచరులు కూడా పార్టీకి గుడ్-బై చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇవ్వాళ్ళ టిటిడిపిలో మరో వికెట్ పడింది. భూపాలపల్లి జిల్లా టిటిడిపి అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు తాను కూడా పార్టీని వీడి తెరాసలో చేరబోతున్నట్లు ప్రకటించారు. కొద్దిసేపటి క్రితమే ఆయన తన అనుచరులతో కలిసి హైదరాబాద్ బయలుదేరారు. ఇవ్వాళ్ళ సాయంత్రం ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో వారు తెరాసలో చేరబోతున్నారు. నేడో రేపో కరీంనగర్ టిటిడిపి నుంచి కూడా మరో ముగ్గురు నేతలు తెరాసలో చేరబోతున్నారు.
ఈ సందర్భంగా టిటిడిపి అధ్యక్షుడు ఎల్.రమణను కొన్ని రోజుల క్రితం రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్న గుర్తుకువస్తోంది. “నేను పార్టీ వీడి వెళ్ళిపోయినందుకు నాపై లేనిపోని విమర్శలు గుప్పిస్తున్న ఎల్.రమణ, ఇంకా అనేకమంది పార్టీని విడిచిపెట్టి తెరాసలో చేరిపోతుంటే ఎందుకు నోరు మెదపరు?” అని ప్రశ్నించారు. నిజమే కదా?