ఈసారైన బాబా కరుణిస్తారా?

నిజామాబాద్ తెరాస ఎంపి కవిత బుధవారం డిల్లీలో ప్రముఖ యోగగురు బాబా రాందేవ్ మరియు ఆయనకు చెందిన పతంజలి సంస్థల సి.ఈ.ఓ. బాలకృష్ణను కలిశారు. ఆయన ఏడాది క్రితమే నిజామాబాద్ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ స్థాపించడానికి సంసిద్దత వ్యక్తం చేశారు. ఒకవేళ వీలుకుదరకపోతే, తెలంగాణా జిల్లాల నుంచి పసుపు, ఇతర ఆహార ఉత్పత్తులను నాగపూర్ లోని తమ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం భారీ స్థాయిలో కొనుగోలు చేయడానికి సిద్దమని బాబా చెప్పారు. ఆయన ప్రతిపాదనలకు అప్పుడే తెలంగాణా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, జిల్లాలో లక్కంపల్లి వద్ద ఫ్యాక్టరీ కోసం భూమిని కేటాయించడానికి అంగీకరించింది. కానీ ఇంతవరకు దానిపై ఆయన ఎటువంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతో ఎంపి కవిత ఇవ్వాళ్ళ మళ్ళీ మరోమారు స్వయంగా డిల్లీలోని ఆయన కార్యాలయానికి వెళ్ళి వారిరువురితో మాట్లాడారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకొంటామని వారు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

నిజామాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాలో ఎక్కువగా పండించే పసుపు, ఇతర ఆహార ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసే యూనిట్ స్థాపించాలని బాబా ఆలోచన. అది స్థాపించబడినట్లయితే నిజామాబాద్ జిల్లా చుట్టుపక్కల రైతులు తమ పంటలను అమ్ముకోవడానికి దళారుల చుట్టూ తిరుగవలసిన అవసరం ఉండదు. అలాగే తమ పంటలకు గిట్టుబాటు ధరలు లభించలేదని బాధపడవలసిన అవసరం కూడా ఉండకపోవచ్చు. అందుకే రాందేవ్ బాబాను ఒప్పించి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ స్థాపింపజేయడానికి ఎంపి కవిత కృషి చేస్తున్నారు. మరి ఆమె ప్రయత్నాలు ఎప్పటికి ఫలిస్తాయో చూడాలి.