తెలంగాణాలో మరో పునర్వ్యవస్థీకరణ షురూ

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత 10 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 31 జిల్లాలుగా మార్చడం జరిగింది. దాని తరువాత రాష్ట్రంలో కొత్తగా 4-5,000 గ్రామ పంచాయితీల ఏర్పాటుకు ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. . ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు, పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో కొత్తగా 40 పురపాలక సంఘాలు (మున్సిపాలిటీలు) లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి కేటిఆర్ చెప్పారు. అందుకోసం ఆయన నిన్న జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమయ్యారు. 

రెండేళ్ళ క్రితం ప్రభుత్వం చేపట్టిన సమగ్రసర్వే, 2011 జనాభా లెక్కల ప్రాతిపదికగా 15,000కు మించి జనాభా ఉన్న మేజర్ గ్రామపంచాయితీలను పురపాలక సంఘాలుగా మార్చాలనుకొంటున్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఉన్న పురపాలక సంఘాలకు 3-5 కిమీ పరిధిలోకి వచ్చే గ్రామాలను వాటిలో విలీనం చేయాలనుకొంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న పంచాయితీల కాలపరిమితి వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తవబోతోంది కనుక ఆలోగా ఎంపికచేసిన పంచాయితీలను డీ నోటిఫై చేసి, కొత్త పురపాలక సంఘాల ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి కేటిఆర్ కలెక్టర్లను ఆదేశించారు. సంక్లిష్టమైన ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దల సహకారంతో గ్రామాల విలీనాల కోసం గ్రామపంచాయితీలలో తీర్మానాలు చేయాలని కోరారు. 

స్వచ్చ సర్వేక్షణ్-2018 ర్యాంకులలో తెలంగాణా రాష్ట్రం నెంబర్: 1 స్థానంలో నిలపడం లక్ష్యంగా అధికారులు అందరూ కలిసి పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా అకాడమీ ఆఫ్ స్టాఫ్ కాలేజ్ ఇండియా (అస్కి) రూపొందించిన స్వచ్చ సర్వేక్షణ్-2018 సిడిని మంత్రి కేటిఆర్ విడుదల చేశారు.