అనురాగ్ శర్మ ఈజ్ బెస్ట్ పోలీస్ ఆఫీసర్: కెసిఆర్

మొన్న ఆదివారం పదవీ విరమణ చేసిన తెలంగాణా రాష్ట్ర మాజీ డిజిపి అనురాగ్ శర్మకు ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న ప్రగతి భవన్ లో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. 

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, “తెలంగాణా రాష్ట్రం వేర్పడితే రాష్ట్రం అసాంఘిక శక్తులు, మావోయిస్టులు రెచ్చిపోతారని, దాంతో రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుందని గత పాలకులు భయపెట్టారు. కానీ ఈ మూడున్నరేళ్ళలో ఒక్క అవాంచనీయ సంఘటన జరుగలేదు. రాష్ట్రం ఏర్పడిన తరువాత దేశంలోనే మంచి శాంతిభద్రతలున్న రాష్ట్రంగా తెలంగాణా నిలిచింది. తరచూ మతకలహాలు జరిగిన హైదరాబాద్ నగరంలో ఇప్పుడు పూర్తి ప్రశాంత వాతావరణం ఏర్పడింది. దీనికంతటికీ కారణం రాష్ట్రానికి మొట్ట మొదటి డిజిపిగా బాధ్యతలు చేపట్టిన అనురాగ్ శర్మ అమలుచేసిన అద్భుతమైన పోలీసింగ్ విధానమే. అయన ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో, విధానాలతో ముందుకు సాగుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడారు. పోలీస్ శాఖను ఆధునీకరించడం, షీ టీమ్స్ ఏర్పాటు, లక్షకు పైగా సిసి కెమెరాల ఏర్పాటు, కౌంటర్ ఇంటలిజెన్స్, గ్రే హౌండ్స్ విభాగాల పనితీరు మెరుగుపరచడం వంటి అనేక చర్యలు చేపట్టి దేశంలో తెలంగాణా రాష్ట్రం, తెలంగాణా పోలీస్ వ్యవస్థకు మంచిపేరు సంపాదించిపెట్టారు. 

అసెంబ్లీ సమావేశాలు, ఎన్నికలు, కృష్ణాగోదావరి పుష్కరాల సమయాలలో అటు అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఇటు ప్రజలతో చక్కగా సమన్వయం చేసుకొంటూ చక్కగా పోలీసింగ్ చేసి, కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా చాలా సమర్ధంగా అనురాగ్ శర్మ తన శాఖను నిర్వహించారు. అయన అమలుచేసిన విధానాల వలననే రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు నెలకొని ఉన్నాయిప్పుడు. 

రాష్ట్ర పోలీస్ వ్యవస్థను కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా పలు సందర్భాలలో మెచ్చుకొన్నప్పుడు నేను చాలా ఆనందంతో ఉప్పొంగిపోయేవాడిని. రాష్ట్రానికి ఇంత చక్కగా సేవలు అందించిన అనురాగ్ శర్మగారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఒక కాపుకాచిన  అనురాగ్ శర్మ సేవలు ఇంకా రాష్ట్రానికి అవసరమని భావించినందునే ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించుకొన్నాము,” అని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. 


డిజిపిగా పదవీ విరమణ చేసినవారికి ఇదివరకు ఎన్నడూ ముఖ్యమంత్రులు ఇంత ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపిన దాఖలాలు లేవు. కానీ రాష్ట్ర మొట్టమొదటి డిజిపి అనురాగ్ శర్మకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ తో సహా రాష్ట్ర మంత్రులు, కొత్తగా డిజిపిగా బాధ్యతలు చేపట్టిన ఎం.మహేందర్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఘనంగా సన్మానించి, వీడ్కోలు పలకడం చాలా అభినందనీయం. ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక చక్కటి సాంప్రదాయం ప్రారంభించారని చెప్పవచ్చు. 

తనను ఇంతగా గౌరవించినందుకు అనురాగ్ శర్మ చాలా సంతోషం, సంతృప్తి పొంది ఉంటారు. ఈ సందర్భంగా అనురాగ్ శర్మ మాట్లాడుతూ, " ఈ గౌరవం రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో ఉన్నవారందరికీ ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాను," అన్నారు. అది అక్షరాల నిజమని చెప్పవచ్చు.ఈ చిన్న కార్యక్రమం...దానిలో ముఖ్యమంత్రి కెసిఆర్ నోట పోలీస్ వ్యవస్థపై ప్రశంసలతో రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నవారందరికీ కూడా చాలా సంతృప్తి కలుగుతుంది. తమ కష్టాన్ని ప్రభుత్వం గుర్తిస్తోందనే భావన కలగుతుంది. ఆ కారణంగా వారికి ప్రభుత్వం పట్ల ఇంకా నమ్మకం, గౌరవం, అభిమానం ఏర్పడుతుంది. అది వారి పనితీరును ఇంకా మెరుగుపరుస్తుందని భావించవచ్చు. ‘హ్యూమన్ రిలేషన్స్’ ఇంత చక్కగా మెయింటెయిన్ చేసి అద్భుతమైన ఫలితాలు సాధించడంలో కెసిఆర్ కు మరెవరూ సాటిరారేమో?