పాపం రాహుల్..ఇంకా ఎప్పటికి ధైర్యం చేస్తాడో?

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దురదృష్టమో ఏమో గానీ అయన ఎప్పుడు పార్టీ పగ్గాలు చేపడుదామనుకొన్నా ఏదో ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైన ఎన్నికలు వచ్చి పడుతుంటాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆ అప్రదిష్ట రాహుల్ గాంధీ మెడకు చుట్టుకోకూడదనే ఆలోచనతో అయనకు పార్టీ పగ్గాలు అప్పగించకుండా వాయిదా వేస్తారు. ఈవిధంగా ఇప్పటికే చాలాసార్లు జరిగింది. పార్టీ అధ్యక్ష బాద్యతలు చేపట్టి ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కొని గెలుపోటములను అంతే ధైర్యంగా స్వీకరించి ఉండి ఉంటే అయన గౌరవం పెరిగి ఉండేది కానీ ఓడిపోతామనే భయంతో పార్టీ పగ్గాలు చెప్పట్టడానికి వెనకాడటం ఖచ్చితంగా నాయకత్వ లక్షణాల లోపమేనని చెప్పక తప్పదు. 

నాయకత్వ లక్షణాల గురించి చెప్పుకోవాలంటే తప్పనిసరిగా ప్రధాని నరేంద్ర మోడీ గురించి చెప్పుకోక తప్పదు. 2014 ఎన్నికలకు ముందు భాజపా అయనను ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రకటించక ముందు, ఆ తరువాత ఆయన భాజపాలో అంతర్గతంగా, దేశంలో ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. కారణాలు అందరికీ తెలిసినవే. అంతటి వ్యతిరేక పరిస్థితులను కూడా అయన సవాలుగా స్వీకరించి, పార్టీలో అందరినీ తన దారికి తెచ్చుకొని, భాజపాను గెలిపించుకొనే బాధ్యతను తన భుజాన్న వేసుకొని, 2014 ఎన్నికలలో ప్రచారం చేసి విజయం సాధించి అధికారం దక్కించుకొన్నారు. ఆ తరువాత కధ అందరికీ తెలిసిందే. 

అదే..రాహుల్ గాంధీకి పదేళ్ళపాటు ప్రధానమంత్రి పదవిని ‘రిజర్వ్’ చేసి పెట్టినప్పటికీ, పార్టీలో అందరూ ఆయనకు అన్ని విధాల సహకరించడానికి సిద్దంగా ఉన్నప్పటికీ, ఆ పదవిని చేపట్టడానికి చాలా భయపడ్డారు. ఆ తరువాత వరుసగా వస్తున్న ఎన్నికలను చూసి పార్టీ పగ్గాలు చేపట్టడానికి కూడా భయపడుతూనే ఉన్నారు. 

ఈ దీపావళి పండుగ తరువాత పార్టీ పగ్గాలు చేపడుతారని కాంగ్రెస్ నేతలే చెప్పుకొన్నారు. కానీ ఇప్పుడు గుజరాత్ ఎన్నికల తరువాత అంటున్నారు. ఒకవేళ గుజరాత్ ఎన్నికలలో గెలిస్తే అది తన మహిమేనని చెప్పుకొని గర్వంగా కిరీటం తగిలించుకోవచ్చు కానీ సర్వేలు మళ్ళీ భాజపాయే అధికారంలోకి వస్తుందని చెపుతున్నాయి. 

కనుక ఓడిపోతే గుజరాత్ లో పార్టీని గెలిపించుకోలేనివాడు 2019 సార్వత్రిక ఎన్నికలలో పార్టీని ఏమి గెలిపించగలడని పార్టీలోవారే మళ్ళీ అభ్యంతరం చెప్పవచ్చు. ఈ ఓటమి బాధ, అవమానం చల్లారి మళ్ళీ పార్టీ పగ్గాలు చెప్పట్టడానికి రాహుల్ గాంధీ సిద్దమైనప్పుడు మళ్ళీ ఏవో ఎన్నికలు వచ్చేస్తాయి. అప్పుడు మళ్ళీ ఇదే కధ రిపీట్ అవుతుంది. రాహుల్ గాంధీ మరి పార్టీ పగ్గాలు ఎప్పుడు చేపడతారో పాపం..