మల్కజ్ గిరి ప్రాంతంలో గల బచపన్ ప్లే స్కూల్లో ఈరోజు మూడేళ్ళ శివ రుచిత్ అనే పసిబాలుడు నీళ్ళ సంపు(ట్యాంక్) లో పడి మృతి చెందాడు. బాలల దినోత్సవమైన ఈరోజే చిన్నారి శివ రుచిత్ ప్రమాదవశాత్తు మరణించడం అందరినీ కలచివేసింది.
బాలల దినోత్సవం సందర్భంగా ఈరోజు స్కూల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేందుకు చిన్నారి శివ రుచిత్ ను అతని తల్లితండ్రులు స్కూలుకు పంపించారు. అతను ఆడుకొంటూ అక్కడే సమీపంలో మూత తీసి ఉన్న నీళ్ళ సంపులో పడిపోయాడు. ఆ సమయంలో అటువైపు ఎవరూ రాకపోవడంతో అభం శుభం తెలియని ఆ చిన్నారి నీళ్ళలో మునిగి చనిపోయాడు. స్కూల్లో చిన్నారులు తిరుగుతుంటారని తెలిసి ఉన్నప్పటికీ సంపు మూతను తెరచి ఉంచడం మానవ తప్పిదమే. ఆ నిర్లక్ష్యానికి నిండు నూరేళ్ళు జీవించవలసిన చిన్నారి శివ రుచిత్ బలైపోయాడు. ఈ విషయం తెలుసుకొని బాలుడి తల్లితండ్రులు అక్కడకు చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.