ఆ ఎస్.ఐ.పై సస్పెన్షన్ వేటు

జోగులాంబ జిల్లా కేంద్రం గద్వాల పోలీస్ సాయుధ విభాగంలో మహిళా హోంగార్డు చేత బాడీ మసాజ్ చేయించుకొన్న ఏఆర్ ఏఎస్.ఐ. హాసన్ ను సస్పెండ్ చేస్తూ ఐజి స్టీఫన్ రవీంద్ర ఈరోజు ఉత్తర్వులు జారీచేశారు. పోలీస్ శాఖలో కానిస్టేబుల్స్, హోంగార్డుల చేత ఉన్నతాధికారుల ఇళ్ళలో ఇంటిపనులు చేయించుకొనే దురలవాటు ఇదివరకు ఉండేది. తెలంగాణాలో తెరాస సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని కట్టడిచేసింది. కానీ పోలీస్ స్టేషన్లలో, పోలీస్ శాఖకు చెందిన ఇతర కార్యాలయాలలో దిగివ స్థాయి సిబ్బందికి ముఖ్యంగా మహిళా పోలీసులకు, హోంగార్డులకు ఇటువంటి అగచాట్లు తప్పడం లేదని ఈ సంఘటన రుజువుచేసింది.

ఏఆర్ ఏఎస్.ఐ. హాసన్ తన కార్యాలయంలో మహిళా హోంగార్డు చేత బాడీ మసాజ్ చేయించుకొన్న వీడియోను ఎవరో మీడియాకు అందజేయయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది లేకుంటే ఇటువంటి దుశ్చర్యలు సాగుతూనే ఉండేవి. ఇది బయటకు వచ్చినంత మాత్రాన్న ఇక ముందు జరుగావనే నమ్మకం లేదు. దేశంలోకెల్లా తెలంగాణా పోలేస్ వ్యవస్థ అత్యుత్తమైనదని ఇప్పుడిప్పుడే పేరు సంపాదించుకొంటున్న సమయంలో ఇటువంటి సంఘటనలు పోలీస్ శాఖకు మాయనిమచ్చ కలిగిస్తాయి. దీని వలన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అప్రదిష్ట కలుగుతుంది. కనుక ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.