గత సోమవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణాలో వ్యవసాయ రంగానికి ప్రయోగాత్మకంగా నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా మొదలైంది. ఆ ప్రయోగం విజయవంతం అయినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. కానీ మరొక వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా విద్యుత్ సరఫరా చేసి లోటుపాట్లను పరిశీలించుకొంటే మంచిదని భావిస్తున్నారు. నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా ప్రయోగం ప్రారంభం అయిన తరువాత గత గురువారంనాడు అత్యధికంగా 7,750 మెగావాట్స్ విద్యుత్ వాడకం జరిగినట్లు గుర్తించారు. వేసవిలో అది దాదాపు 11,000 మెగావాట్లకు పెరగవచ్చని విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఈ ప్రయోగం విజయవంతం అయినందున, దీని గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ తో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా వచ్చే రబీ సీజన్ నుంచి తప్పనిసరిగా నిరంతర ఉచిత విద్యుత్ అందించాలని భావిస్తున్నారు కనుక వారి ప్రతిపాదనలకు అయన ఆమోదం తెలిపే అవకాశాలే ఎక్కువని భావించవచ్చు.
వచ్చే వేసవిలో పెరుగబోయే విద్యుత్ డిమాండ్ ను తట్టుకోవడానికి వీలుగా 1,080 మెగావాట్ల సామార్ధ్యం గల భద్రాద్రి ప్రాజెక్టు, 800 మెగావాట్ల సామార్ధ్యం గల కొత్తగూడెం ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణపనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ద్వారా వాటి నిర్మాణసంస్థలపై ఒత్తిడి చేయాలని విద్యుత్ శాఖ అధికారులు భావిస్తున్నారు.