తెలంగాణా రాష్ట్ర నూతన డిజిపిగా ఎం.మహేందర్ రెడ్డి ఆదివారం ఉదయం 11.30 గంటలకు భాద్యతలు స్వీకరించారు. అనతరం మీడియాతో మాట్లాడుతూ తన ప్రాధాన్యతలను వివరించారు. ముందుగా...రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో ఈ అత్యున్నతమైన పదవికి తనను ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి రాజధాని హైదరాబాద్ వరకు అన్ని చోట్ల ఒకేరకమైన, ఒకే స్థాయిలో ప్రజలకు సేవలు (యూనిఫామిటి ఇన్ సర్వీసస్) అందించడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, మూడు కమీషనరేట్స్ లలో ఒకే రకమైన సేవలు , సిసి కెమెరాల ఏర్పాటు చేయడం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో తను పనిచేయబోతున్నట్లు డిజిపి ఎం.మహేందర్ రెడ్డి చెప్పారు.
తెలంగాణా రాష్ట్రానికి మొట్టమొదటి డిజిపిగా పనిచేసిన అనురాగ్ శర్మ కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా నివారించడమే కాకుండా రాష్ట్ర పోలీసింగ్ వ్యవస్థను దేశంలోకే అత్యుత్తమ పోలీస్ వ్యవస్థగా రూపుదిద్దారని ప్రశంసించారు. తాను కూడా ఆయన అడుగుజాడలలోనే నడుస్తూ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను మరింత తీర్చిదిద్దుతానని చెప్పారు.
పదవీ విరమణ చేసిన అనురాగ్ శర్మ వీడ్కోలు పెరేడ్ ఆదివారం ఉదయం తెలంగాణా రాష్ట్ర పోలీస్ శిక్షణ కేంద్రమైన రాజబహదూర్ వెంకటరామిరెడ్డి మైదానంలో జరిగింది. రాష్ట్రానికి ఆయన సేవలు ఇంకా అవసరమని ముఖ్యమంత్రి కెసిఆర్ భావించినందున ఆయనను రాష్ట్ర హోంశాఖ ముఖ్య సలహాదారుగా నియమించిన సంగతి అందరికీ తెలిసిందే.
డిజిపిగా పదవీ విరమణ చేసిన తరువాత అయన ప్రభుత్వ సలహాదారుగా భాద్యతలు స్వీకరించారు. అనంతరం అనురాగ్ శర్మ, డిజిపి ఎం.మహేందర్ రెడ్డి ఇద్దరూ గవర్నర్ నరసింహన్ ను కలిశారు. డిజిపిగా బాధ్యతలు చేపట్టిన మహేందర్ రెడ్డికి తెలంగాణా రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులే కాకుండా ఆంధ్రా పోలీస్ ఉన్నతాధికారులు కూడా వచ్చి అభినందనలు తెలుపడం విశేషం.