కృష్ణానదిలో పడవమునక: 14 మంది మృతి

కృష్ణా జిల్లాలో ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద గల పవిత్ర సంగమం వద్ద పర్యాటకుల బొట్లు బోల్తాపడటంతో 14 మంది నీట మునిగి చనిపోయారు. మరో 9మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు బోటులో మొత్తం 38మంది పర్యాటకులు ఉన్నారు. అక్కడికి సమీపంలోనే ఉన్న స్థానిక మత్సకారులు, ఇతర టూరిస్ట్ బోట్ ఆపరేటర్లు, ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందాలు కలిసి 15 మంది ప్రాణాలు రక్షించగలిగారు. గల్లంతైనవారి కోసం ఎన్.డి.ఆర్.ఎఫ్. సిబ్బంది గాలింపు చర్యలు చేయపట్టారు. 

ఒంగోలుకు చెందిన 32 మంది వాకర్స్ క్లబ్ సభ్యులు, నెల్లూరుకు చెందిన 6 మంది కలిసి ఇబాహ్రీంపట్నం వద్ద పవిత్ర సంగమంలో కృష్ణానది హారతి కార్యక్రమం చూడటానికి ఆదివారం సాయంత్రం భవానీ ఐలాండ్ నుంచి ‘రివర్ బే’ అనే ఒక టూరిస్ట్ సంస్థకు చెందిన బోటులో బయలుదేరారు. ఆ బోటు నడపడానికి ఇంకా పర్యాటక శాఖ నుంచి అనుమతి లభించనప్పటికీ ట్రయల్ రన్స్ పేరిట ఈరోజే మొదటిసారిగా బోటును నడిపించిన్నట్లు తెలుస్తోంది. బోటు డ్రైవర్ కొత్తవాడు కావడంతో ఫెర్రీఘాట్ వద్ద గల ఇసుక దిబ్బను గుర్తించలేకపోవడంతో బోటు దానిని గుద్దుకొని పక్కకు ఒరిగి బోర్లా పడింది. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో నది చాలా లోతుగా ఉండటంతో మహిళలు, పిల్లులు నీట మునిగి చనిపోయారు. మరికొందరు బోటు బోర్లా పడటంతో దాని క్రింద చిక్కుకొని నీట మునిగి చనిపోయారు. మరికొందరు ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోయారు. బోటులో పరిమితికి మించి పర్యాటకులను ఎక్కించుకోవడం, వారికి లైఫ్ జాకెట్స్ వంటి రక్షణ సౌకర్యాలు కల్పించకపోవడం చేత ప్రాణనష్టం ఎక్కువ జరిగింది. ప్రమాదం జరిగిన సమయానికి చీకటి పడటంతో నీట మునుగుతున్నవారిని గుర్తించి రక్షించడం కష్టం అయ్యింది.

ఈ ప్రమాదం సంగతి తెలుసుకొన్న జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు తక్షణం అక్కడకు చేరుకొని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.