తెలంగాణా రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన శనివారం నాంపల్లి కార్యాలయంలో టిజెఎసి సమావేశం జరిగింది. అనంతరం ఆయన ఆ సమావేశపు వివరాలను మీడియాకు వివరించారు.
“ముందుగా ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య, తెలంగాణా సాధన ఉద్యమాలలో తొలిదశ నుంచి మలిదశ వరకు అలుపెరుగని పోరాటాలు చేసిన ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్య మృతికి సంతాపం తెలిపాము.
కొలువుల కొట్లాట బహిరంగ సభకు హైకోర్టు అనుమతించినందున, ఈ నెల 30వ తేదీన సరూర్ నగర్ స్టేడియంలో సభను నిర్వహించాలని నిర్ణయించాము. హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయంగా భావిస్తున్నాము. అలాగే డిసెంబర్ 9,10 తేదీలలో మళ్ళీ తెలంగాణా అమరవీరుల స్పూర్తియాత్రను నిర్వహించాలని నిర్ణయించాము.
ఇక జెయిసిని రాజకీయ పార్టీగా మార్చడానికి ఆలోచనలు చేస్తున్నాము. రాజకీయ కార్యాచరణ అవసరమని సభ్యులు చెపుతున్నారు. కనుక ఈ అంశంపై మరింత లోతుగా చర్చించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకొంటాము. ఉద్యోగాల భర్తీ చేయమని అడిగితే మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామనుకోవడం సరికాదు. ప్రభుత్వంలో వివిధ శాఖలలో ప్రస్తుతం ఉన్న ఖాళీల సంఖ్య, వాటిని భర్తీ చేయడానికి కేలండర్ విడుదల చేయమని కోరుతున్నాము. దానిలో ప్రభుత్వానికి అభ్యంతరకరమైన విషయం ఏముందో మాకు అర్ధంకావడం లేదు.
శాంతి భద్రతల పేరుతో ఎవరూ సభలు, సమావేశాలు జరుపుకోకూడదని అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్దం. అటువంటి నిరంకుశవైఖరి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎల్లకాలం సాధ్యం కాదు. కనుక ఇప్పటికైనా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ను పునరుద్దరించవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. కాంట్రాక్ ఉద్యోగులకు సమానపనికి సమాన వేతనం విధానం అమలుచేయవలసిందిగా కోరుతున్నాము,” అని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.