ప్రయాణికుడిని చితబాదిన ఇండిగో సిబ్బంది

ఇండిగో విమానం ప్రయాణికుడికి దాని సిబ్బంది చేతిలో ఊహించని చేదు అనుభవం ఎదురయింది. దానికి సంబంధించిన వీడియోను ఆ సంస్థ సిబ్బందిలో ఒకరు నిన్న సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సుమారు మూడు వారాల క్రితం జరిగిన ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. 

సుమారు మూడు వారాల క్రితం రాజీవ్ కటియాల్ అనే (53) అనే ప్రయాణికుడు ఇండిగో విమానంలో మధ్యాహ్నం సుమారు 11.30 డిల్లీ విమానాశ్రయంలో దిగారు. బస్సు దిగిన ప్రయాణికులను విమానాశ్రయంలోకి చేర్చడానికి ఇండిగో సంస్థకు చెందిన బస్సు రాగా రాజీవ్ కటియాల్ దానిలో ఎక్కడానికి సిద్దపడ్డారు. కానీ అది నిండిపోవడంతో వెనక్కు వెళ్ళి, అప్పుడు ఎండ చాలా తీవ్రంగా ఉండటంతో పక్కనే తను దిగిన విమానం నీడలో నిలబడ్డారు. 

అప్పుడు ఇండిగో గ్రౌండ్ సిబ్బందిలో జూడి థామస్ అనే ఉద్యోగి అక్కడ నిలబడవద్దని వారించాడు. అయితే అప్పటికే చాలా సేపటి నుంచి బస్సు కోసం వేచి చూస్తూ విసుగెత్తిపోయున్న రాజీవ్ కటియాల్, “నాపై అరిచే బదులు బస్సును రప్పించవచ్చు కదా?” అని కోపంగా జవాబివ్వడంతో వారిరువురి మద్య మాటామాటా పెరిగింది. ఇంతలో మరో బస్సు రావడంతో రాజీవ్ కటియాల్ ఆ బస్సులో ఎక్కబోతుండగా, “వాడిని బస్సు ఎక్కనీయకండి..వాడి సంగతి ఇక్కడే చూద్దాం” అని జూడి థామస్ తన సహాయకులకు చెప్పడంతో వారు ఆయనను పట్టుకొని పక్కకు లాగేసి బస్సును పంపించేశారు.

 

దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన రాజీవ్ కటియాల్, ఆ ఉద్యోగి మెడ పట్టుకొని తోశారు. అక్కడే ఉన్న ఇండిగో సిబ్బంది అక్కడకు చేరుకొని రాజీవ్ కటియాల్ పై దాడి చేయడంతో ఆయన క్రింద పడిపోయారు. ఆయన కూడా గట్టిగానే ప్రతిఘటించారు. ఈ కొట్లాటను అక్కడే ఉన్న మరో ఇండిగో ఉద్యోగి తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. ఆ తరువాత ఆయన పోలీసులకు పిర్యాదు చేయగా ఇండిగో యాజమాన్యం అతనికి నచ్చజెప్పి కేసు నమోదు కాకుండా జాగ్రత్త పడినట్లు కటియాల్ చెప్పారు. 

కానీ ఎవరూ ఊహించని విధంగా ఆ కొట్లాట వీడియో బయటకు రావడంతో ఈ సంగతి పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు చెవిలో పడింది. 

అధికార, ప్రతిపక్షాలు, యావత్ మీడియాకు తెలిసిపోవడంతో ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్ జరిగిన దానికి పశ్చాతాపం వ్యక్తం చేస్తూ పౌర విమానయాన శాఖ మంత్రికి లేఖ వ్రాశారు. ఫోన్ మరియు ట్విట్టర్ ద్వారా రాజీవ్ కటియాల్ కు క్షమాపణ చెప్పారు. ఆయనతో దురుసుగా వ్యవహరించిన సిబ్బందిని తక్షణం విధులలో నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. అయితే దానిలో కూడా తమ సిబ్బంది తప్పేమీ లేదన్నట్లు అయన సమర్ధించుకోవడం గమనిస్తే, జరిగిన దానికి అయన కూడా పశ్చాతాపం పడటం లేదని అర్ధం అవుతోంది. కాకపోతే తమ ఉద్యోగి తీసిన వీడియో వలన ఈ వ్యవహారం బయటకు పోక్కినందుకే ఎక్కువ బాధపడినట్లున్నారు. అందుకే కటియాల్ పై దాడి చేసిన ఇద్దరు ఉద్యోగులతోబాటు ఈ వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టిన ఉద్యోగిని కూడా సస్పెండ్ చేశారు. ఒలింపిక్స్ విజేత, బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధుతో కూడా హైదరాబాద్ విమానాశ్రయంలో ఇండిగో గ్రౌండ్ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించిన సంఘటన మరువక ముందే మళ్ళీ ఇది వెలుగులోకి వచ్చింది. 

(వీడియో: ఇండియా సంవాద్ సౌజన్యంతో)