రేవంత్ గురించి కోమటిరెడ్డి ఏమన్నారంటే...

తెదేపా నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి గురించి సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి  మాట్లాడారు.

“రేవంత్ రెడ్డిని నేను మనస్పూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. అయన తన రాజీనామా లేఖను స్పీకర్ చేత ఆమోదింపజేసుకొంటే గౌరవంగా ఉంటుంది. అయన రాజీనామా చేస్తే కొడంగల్ శాసనసభ స్థానానికి ఉపఎన్నికలు జరగడం తధ్యం. వాటిలో ఆయనను ఓడించి రాజకీయంగా దెబ్బ తీసేందుకు తెరాస సర్వశక్తులు ఒడ్డటం కూడా ఖాయమే. ఒకవేళ ఉపఎన్నికలే వస్తే నాతో సహా రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అందరూ ఆయనకు అండగా నిలబడి ఆయనను గెలిపించుకొంటాము. కొడంగల్ లో మళ్ళీ ఆయనే గెలిచి తెరాసకు తన సత్తా చూపవలసిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.

రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నారనే వార్తలపై స్పందిస్తూ, “ఇంతకు ముందు నేను, భట్టి విక్రమార్క పాదయాత్రలు చేయాలనుకొన్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానం మాకు అనుమతీయలేదు. కనుక రేవంత్ రెడ్డిని కూడా అనుమతించకపోవచ్చు. తప్పనిసరి అయితే టి-కాంగ్రెస్ నేతలందరూ కలిసి బస్సు యాత్ర చేపట్టాలని కోరుతుందేమో?” అని అన్నారు. 

వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో టి-కాంగ్రెస్ పార్టీ చాలా సునాయాసంగా 50 సీట్లు గెలుచుకోగలదని, మరికాస్త కష్టపడితే 60-70 సీట్లు గెలుచుకోగలదని భావిస్తున్నాని అన్నారు. ప్రజా సమస్యలపై తమ పార్టీ నేతలు కలిసికట్టుగా పోరాడలేకపోతున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నేతలు అందరూ కలిసి పోరాడితే తెరాసను ఎదుర్కోవడం కష్టమేమీ కాదని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి తెరాసలోకి వెళ్ళిన ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి పిల్లికి బిచ్చం పెట్టని పిసినారి అని, ఇక అయన తన నియోజకవర్గం ప్రజలకు ఏమి చేయగలరని ప్రశ్నించారు. తెరాసలో అయన పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలాగ ఉందని కనుక  ఆయన ప్రగల్భాలు పలకడం మానుకొంటే మంచిదని అన్నారు.