రాష్ట్ర డిజిపి అనురాగ్ శర్మ పదవీకాలం పూర్తవడంతో ఆయన స్థానంలో హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ గా వ్యవహరిస్తున్న మహేందర్ రెడ్డిని డిజిపిగా నియమించారు. అనురాగ్ శర్మ పనితీరు పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా సంతృప్తి చెందినందున ఆయనను రాష్ట్ర హోంశాఖ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నగర కమీషనర్ గా వివి శ్రీనివాసరావును నియమించారు.
1986 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన మహేందర్ రెడ్డి స్వస్థలం ఖమ్మం జిల్లాలో కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామం. అయన వరంగల్ రీజియనల్ ఇంజనీరింగ్ కాలేజీ (నిట్) లో బీటెక్ చేసిన తరువాతః డిల్లీ ఐఐటి నుంచి ఎంటెక్ చేశారు. తరువాత పోలీస్ వ్యవస్థపై మక్కువతో ఐపిఎస్ చేశారు. ఇంతకు ముందు ఆయన గుంటూరు, కర్నూలు, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలో పోలీస్ శాఖలో వివిధ హోదాలలో పనిచేశారు. అదేవిధంగా పోలీస్ శాఖలో ఇంటలిజెన్స్ (చీఫ్), గ్రేహౌండ్స్ (ఐజి), విభాగాలలో పనిచేశారు. సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమీషనర్ గా పనిచేశారు. ఇప్పుడు పోలీస్ శాఖలో సర్వోన్నత ఉద్యోగమైన డిజిపి పదవిని ఆదివారం చేపట్టబోతున్నారు.