ఉభయసభలు సోమవారానికి వాయిదా

ఈరోజు శాసనసభలో  మంచినీటి సమస్య, కార్పోరేట్ కాలేజీల వ్యవహారాలు, ప్రభుత్వాసుపత్రుల పనితీరుపై చర్చ జరిగింది. మండలిలో పిడి యాక్ట్ సవరణ బిల్లు, తెలంగాణా రోడ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ బిల్లు, దుఖాణాల స్థాపన సవరణ బిల్లులపై చర్చించి ఆమోదం తెలిపారు. అనంతరం ఉభయసభాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. 

ఈరోజు శాసనసభలో కాంగ్రెస్ సభ్యురాలు గీతారెడ్డి ప్రైవేట్ ఆసుపత్రులలో డబ్బు కోసం అవసరం లేకపోయినా గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారని, వాటిని అరికట్టేందుకు తెరాస సర్కార్ ఏమి చర్యలు తీసుకొంటోంది? అని ప్రశ్నించగా ఆమెకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి లక్ష్మారెడ్డి సమాధానం చెపుతూ, “గతంలో మీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాసుపత్రులను నిర్లక్ష్యం చేయడం వలనే రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రులు పెరిగిపోయాయి. కానీ మా ప్రభుత్వం అధికారం చేపట్టగానే ప్రభుత్వాసుపత్రులలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, అవసరమైన చోట సిబ్బందిని నియమిస్తున్నాము. మరోపక్క గర్భిణి స్త్రీలు ప్రభుత్వాసుపత్రులలో పురుడు పోసుకోనేందుకు ప్రోత్సహించడానికి కెసిఆర్ కిట్స్ అందిస్తున్నాము. మేము చేపట్టిన ఈ చర్యలతో ఈ మూడేళ్ళలో ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య.. ముఖ్యంగా గర్భిణి స్త్రీల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పుడు ప్రభుత్వాసుపత్రులలో సహజ ప్రసవాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులలో సిజేరియన్ ఆపరేషన్ల నియంత్రణకు మా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోంది. త్వరలోనే అవి కూడా నియంత్రణలోకి వస్తాయని ఆశిస్తున్నాము. రాకుంటే ప్రైవేట్ ఆసుపత్రులపై కటినమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోము,” అని మంత్రి చెప్పారు.