తెదేపా ద్విపాత్రాభినయం షురూ

సాధారణంగా సినిమాలలో మాత్రమే హీరోలు ద్విపాత్ర, త్రిపాత్రాభినయం చేయడం చూస్తాము కానీ ఏపిలో తెదేపా నేటి నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీలుగా శాసనసభలో ద్విపాత్రాభినయం చేయబోతోంది. ఏపి శాసనసభలో ఏకైక ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా శాసనసభ సమావేశాలను బహిష్కరించి తమ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పాల్గోవాలని నిర్ణయించుకోవడంతో ఏపి సిఎం చంద్రబాబు నాయుడు మనమే అధికార, ప్రతిపక్ష పాత్రలు రెండూ పోషిద్దామని తెదేపా సభ్యులకు సూచించారు. శాసనసభను తెదేపాకు పూర్తిగా అప్పగించి జగన్ పాదయాత్రలు చేసుకోవాలనుకోవడంతో, దీనిని స్పూర్తిగా తీసుకొని వచ్చే ఎన్నికలలో శాసనసభలో మొత్తం 175 స్థానాలు మనమే గెలుచుకొనేందుకు ఇప్పటి నుంచే గట్టిగా ప్రయత్నిద్దామని చంద్రబాబు నాయుడు అన్నారు. 

తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ప్రతిపక్షం లేని శాసనసభను ఎన్నడూ చూడలేదని చంద్రబాబు నాయుడు అన్నారు. అయన ఏ ఉద్దేశ్యంతో ఆ మాట అన్నా శాసనసభలో ప్రతిపక్ష పార్టీ లేదు కనుక తెదేపా ఇక నిశ్చింతగా తమకు కావలసినట్లు ఈ 10 రోజులపాటు సమావేశాలు నిర్వహించుకోవచ్చు.