రాజ్యసభ సీట్ల కోసం మన రాజకీయ నేతలు, వివిధ రంగాలలో ప్రముఖులు ఎంతగా పైరవీలు చేస్తారో అందరికీ తెలుసు. కానీ పిలిచి రాజ్యసభ సీటు ఇస్తానంటే రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సున్నితంగా తిరస్కరించారు.
డిల్లీలో ఆమాద్మీ పార్టీ తనకున్న శాసనసభ్యుల బలంతో ముగ్గురిని రాజ్యసభకు పంపించగలదు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ముందుగా తన పార్టీలో నేతలనే పంపిస్తుంటుంది. కానీ డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వివిధ రంగాలకు చెందిన ముగ్గురిని రాజ్యసభకు పంపాలని నిర్ణయించుకొని వాటిలో ఒక సీటును రఘురాం రాజన్ కు ఆఫర్ చేశారు. కానీ అయన దానిని సున్నితంగా తిరస్కరించారు.
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉన్నప్పుడు, రాజన్ పై భాజపా ఎంపి సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను గట్టిగా వారించకపోవడంతో అయన చెలరేగిపోయారు. సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఆరోపణలతో తన పేరుప్రతిష్టలకు భంగం కలిగాయని రాజన్ చాలా బాధపడ్డారు. కానీ పదవీ కాలం పూర్తయ్యే వరకు మౌనంగా తన పని తాను చేసుకుపోయి చాలా హుందా పదవీ విరమణ చేసి తనకు ఇష్టమైన భోధనా వృత్తిలో ప్రవేశించారు. బహుశః ఆ చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొనే రాజన్ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొని ఇంత గొప్ప ఆఫర్ ను వదులుకొని ఉండవచ్చు.