కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు పోలింగ్ కొద్ది సేపటి క్రితమే మొదలైంది. ఆ రాష్ట్ర శాసనసభలో మొత్తం 68 స్థానాలుండగా వాటికి 338 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ అవినీతి ఆరోపణలను, సి.బి.ఐ. కేసులను ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ నేతృత్వంలోనే ఎన్నికలను ఎదుర్కొంటోంది. ఇది భాజపాకు చాలా కలిసి వచ్చే అంశంగా మారింది. పైగా రాహుల్ గాంధీతో సహ కాంగ్రెస్ నేతలు అందరూ గుజరాత్ శాసనసభ ఎన్నికల ప్రచారంపైనే ఎక్కువ దృష్టి పెట్టడం కూడా భాజపాకు బాగా కలిసి వచ్చింది. భాజపా ఎన్నికలల్ ప్రచారంలో ప్రధానంగా ఈ రెండు అంశాలనే ఎక్కువగా హైలైట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే అవినీతిపరుడైన వీరభద్ర సింగ్ మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు రాష్ట్రం ఇంకా భ్రష్టు పట్టిపోవడం ఖాయం అని భాజపా గట్టిగ ప్రచారం చేసింది. ఈ మూడున్నరేళ్ళలో మోడీ నేతృత్వంలో కేంద్రప్రభుత్వం ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకుండా పాలన సాగిస్తోందని కనుక ఈసారి భాజపాకే ఓటువేసి గెలిపించాలని కోరారు.
అలాగే కాంగ్రెస్ నేతలకు హిమాచల్ ప్రదేశ్ ప్రజలపై ఏమాత్రం ఆసక్తి లేదని అందుకే రాహుల్ గాంధీతో సహ అందరూ గుజరాత్ ఎన్నికల ప్రచారంపైనే ఎక్కువ దృష్టి పెట్టారని భాజపా చేస్తున్న వాదనలు ప్రజలకు బాగానే చేరినట్లే కనిపిస్తోంది. కనుక ఈసారి ఫలితాలు భాజపాకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.