తెలంగాణా శాసనసభ శీతాకాల సమావేశాలలో గురువారం నుంచి ఈనెల 17వరకు చర్చించాల్సిన అంశాల అజెండా, షెడ్యూల్ ను ఈరోజు బిఎసి సభ్యులు ఖరారు చేశారు. శాసనసభ కమిటీ హాల్ లో బుదవారం జరిగిన బిఎసి సమావేశంలో, వచ్చే ఏడాది మే నెల నుంచి రాష్ట్రంలో రైతులకు ఎకరాకు రూ.4,000 చొప్పున అందిస్తానన్న ఆర్ధిక సహాయం గురించి 9వ తేదీన చర్చించాలని, 10న నిరుద్యోగం-ఉద్యోగాల భర్తీ అంశం, 13న విద్యార్ధులకు ఫీజ్ రీ ఇంబర్స్ మెంట్, 16న సాగునీటి ప్రాజెక్టుల అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. మళ్ళీ 17వ తేదీన మరోసారి బిఎసి సమావేశం నిర్వహించి, తదుపరి అజెండా మరియు షెడ్యూల్ ను ఖరారు చేయాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వం తరపున స్పీకర్ మధుసూదనాచారి, రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్ రావు, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, మంత్రులు ఈటల రాజేందర్ మరియు పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో భట్టి విక్రమార్క, చిన్నారెడ్డి (కాంగ్రెస్), సండ్ర వెంకట వీరయ్య (తెదేపా), కిషన్ రెడ్డి (భాజపా), అక్బరుద్దీన్ ఓవైసీ (మజ్లీస్), సిపిఎం తరపున సున్నం రాజయ్య పాల్గొన్నారు.