ఇవ్వాళ్ళ శాసనసభ సమావేశాలలో మైనార్టీల సంక్షేమంపై జరిగిన చర్చలో మజ్లీస్ పార్టీ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. కెసిఆర్ కు ఆ పదవి (ముఖ్యమంత్రి) చాలా చిన్నదని, దానికంటే ఇంకా పెద్ద పదవికి ఆయన అర్హుడని పొగిడారు. మైనార్టీ సంక్షేమం కోసం తాను చేసిన అనేక సూచనలకు ముఖ్యమంత్రి కెసిఆర్ తక్షణమే స్పందించి, జీవోలు జారీ చేస్తూ, వెంటనే పనులు మొదలయ్యేలా చేశారని మెచ్చుకొన్నారు. గత పదేళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని అనేక కార్యక్రమాలను ముఖ్యమంత్రి కెసిఆర్ చిటికెలో చేసి చూపిస్తున్నారని అన్నారు.
విద్యార్ధులకు సకాలంలో స్కాలర్ షిప్పులు మంజూరు చేస్తుండటమే కాకుండా, గత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్ధులకు చెల్లించవలసిన సుమారు రూ.3-4,000 కోట్ల బకాయిలను కూడా తెరాస సర్కార్ తీర్చివేసిందని ప్రశంసించారు.
కెసిఆర్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఆరేడు దశాబ్దాల కాలంలో ఏనాడూ కనీవినీ ఎరుగని రీతిలో..స్థాయిలో మైనార్టీల సంక్షేమం కోసం అనేక పధకాలు అమలుచేస్తున్నారని, వాటి ఫలాలు సంబంధిత ప్రజలు అందుకొంటున్నారని మెచ్చుకొన్నారు. ముఖ్యంగా మైనార్టీ విద్యార్ధులకు కెసిఆర్ చేస్తున్న ఉపకారం అంతా ఇంతా కాదని అన్నారు. తాను దేశంలో మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించానని కానీ ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణా రాష్ట్రంలో మైనార్టీలకు ఇస్తున్నంత ప్రాధాన్యత, నిధులు చూడలేదని అన్నారు. కనుక ఈసారి తాను వేరే రాష్ట్రం వెళ్ళినప్పుడు ఇదే విషయం గర్వంగా చెప్తానని అన్నారు.
తెరాస సర్కార్ సమాజంలో వివిధ వర్గాల ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న సంక్షేమ పధకాలను, రాష్ట్రాభివృద్ధి చేస్తున్న తీరును చూస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాలేదని చెప్పగలనని అన్నారు. 2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని మళ్ళీ తెరాస-మజ్లీస్ పార్టీలే వస్తాయని అన్నారు. వచ్చే ఎన్నికలలో తెరాసతో కలిసి సాగుతామని ఒవైసీ స్పష్టం చేశారు. ఒకప్పుడు అధికార బెంచీలలో కూర్చొన్న కాంగ్రెస్ పార్టీ, అది చేజేతులా చేసుకొన్నా నిర్వాకాల వలన చివరికి ఇదిగో ఇక్కడకు (ప్రతిపక్షా బెంచీలలోకి) వచ్చి కూర్చోవలసి వచ్చిందని అన్నారు. వచ్చే ఎన్నికల తరువాత శాసనసభలో అడుగుపెట్టగలదో లేదో అని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో మైనార్టీ విద్యార్ధులందరికీ ఉన్నతవిద్యలభ్యసించే అవకాశాలు కల్పించడం కోసం అక్బరుద్దీన్ ఒవైసీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు పలు సూచనలు, అభ్యర్ధనలు, ప్రతిపాదనలు చేశారు.