కొట్లాట సభకు హైకోర్టు అనుమతి

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణా రాజకీయ జెఎసి అధ్వర్యంలో ‘కొలువుల కొట్లాట’ పేరిట హైదరాబాద్ లో బహిరంగ సభ నిర్వహించుకోవడానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో, తమకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టిజెఎసి హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది. ఈరోజు దానిపై హైకోర్టు విచారణ చేపట్టినప్పుడు, సరూర్ నగర్ స్టేడియంలో సభ జరుపుకోవడానికి తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం తరపున న్యాయవాది చెప్పడంతో ‘కొట్లాట సభ’ జరుపుకోవడానికి హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్వాగతించారు. ఒకటి రెండు రోజులలోనే కొట్లాట సభ ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామని చెప్పారు. 

ఉద్యోగాల భర్తీ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఇదివరకు ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో హైదరాబాద్ లో ‘నిరుద్యోగ ర్యాలి’ తలపెట్టినప్పుడు తెరాస సర్కార్ ఆ ర్యాలీ జరుగకుండా అడ్డుకొంది. కానీ దానిని అడ్డుకోవడం వలన రాష్ట్ర ప్రభుత్వం సాధించింది ఏమీ కనబడలేదు కానీ ప్రభుత్వంపై ఆయన చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరినట్లయింది.

ఆ తరువాత ప్రొఫెసర్ కోదండరాం ‘తెలంగాణా అమరవీరుల స్ఫూర్తి యాత్ర’ చేపట్టాలనుకొన్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకొంది. దాని తరువాత ఈ ‘కొట్లాట సభ’కు అనుమతివ్వలేదు. ఒకప్పుడు తెలంగాణా సాధన కోసం పోరాడిన ఆయనపై ప్రభుత్వం ఇన్ని ఆంక్షలు, నిర్బంధం విధించడం వలన ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని గ్రహిస్తే మంచిది. రాష్ట్రంలో అన్ని వర్గాలకు తాము న్యాయం చేస్తున్నామని తెరాస సర్కార్ భావిస్తున్నప్పుడు ప్రొఫెసర్ కోదండరాంను అడ్డుకోనవసరం లేదు. అడ్డుకొన్నట్లయితే ఆయనను చూసి అది భయపడుతున్నట్లు ప్రజలకు సంకేతాలు వెళతాయి. 

ప్రజలకు ఏది మంచో ఏది చెడో తెలుసుకోగల విచక్షణాజ్ఞానం ఉంది. ఒకవేళ ఆయన రాజకీయ దురుదేశ్యంతోనే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా లేదా అయన చెపుతున్న మాటలు అబద్ధమైనా ప్రజలే ఆయనను దూరంగా ఉంచుతారు. కనుక ప్రజలు నిర్ణయించుకోవలసిన ఇటువంటి విషయాలను ప్రభుత్వం నిర్ణయించాలనుకోవడం సరికాదు. 

ప్రొఫెసర్ కోదండరాం..అయన కార్యక్రమాలను అడ్డుకోవడం ద్వారా తమ పార్టీకి, ప్రభుత్వానికి హాని కలుగకుండా కాపాడుకోవాలని తెరాస సర్కార్ ఆలోచిస్తుండవచ్చు. కానీ ఆయనను అడ్డుకోవడం వలననే తెరాస సర్కార్ ఎక్కువ చెడ్డపేరు రాజకీయంగా నష్టం కలిగే ప్రమాదం ఉందని గ్రహిస్తే మంచిది.