ఆ కేసులో తెలంగాణా కూడా..

ఏపి సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది చివరినాటికి పూర్తి చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెపుతునప్పటికీ, అది మరో నాలుగైదేళ్ళ వరకు పూర్తయ్యే అవకాశమేలేదని చంద్రబాబు సమక్షంలోనే ఆ పార్టీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు కొన్ని రోజుల క్రితం చెప్పారు. ఆ ప్రాజెక్టు వలన ఏపికి చాలా ప్రయోజనం కలిగే అవకాశాలు ఉన్నప్పటికీ, దాని దిగువ నుండే ఓడిశాలో అనేక ప్రాంతాలు ముంపుకు గురవుతాయి. అనేక వందల గ్రామాలలో ప్రజలు నిర్వాసితులవుతారు. అలాగే ఇంతకు ముందు ఖమ్మం జిల్లాలో భాగంగా ఉండి, తెలంగాణా ఏర్పడే ముందు ఏపికి బదలాయించబడిన ఏడు మండలాలు కూడా ముంపుకు గురవుతాయి. ఈ ప్రాజెక్టుపై ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలకు కూడా కొన్ని అభ్యంతరాలున్నాయి కనుక అవి కూడా తమ వాదనలను వినిపిస్తున్నాయి.. 

ఈ ప్రాజెక్టుపై ఓడిశా ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు మంగళవారం విచారించింది. ఈ కేసులో తెలంగాణా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలు కూడా చేరేందుకు సుప్రీం కోర్టు మంగళవారం అనుమతించింది. ఈ కేసులో వాటిని భాగస్వాములుగా చేయడంపై ఏపి సర్కార్ చెప్పిన అభ్యంతరాలను సుప్రీం కోర్టు త్రోసి పుచ్చింది. 

కనుక పోలవరం ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ, దానిని పూర్తి చేయడానికి ఏపి సర్కార్ కు తెలంగాణాతో సహా అన్ని రాష్ట్రాల సహకారం తప్పనిసరి అయ్యింది. ఇంతకాలం హైకోర్టు విభజన, హైదరాబాద్ లో సచివాలయ భవనాలను తెరాస సర్కార్ కు అప్పగించడంలో సహాయనిరాకరణ చేస్తున్న ఏపి సర్కార్ ను, ఇప్పుడు ఈ కేసుతో తెరాస సర్కార్ దారికి తెచ్చుకొనే అవకాశం ఏర్పడిందని చెప్పవచ్చు. కనుక హైకోర్టు విభజనకు తెరాస సర్కార్ కు సహకరిస్తే, పోలవరం ప్రాజెక్టు విషయంలో తెరాస సర్కార్ కూడా సహకరించవచ్చు.