ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం చెన్నై పర్యటనలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకె అధినేత కరుణానిధి ఇంటికి వెళ్ళి ఆయనను పరామర్శించారు. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో డిఎంకెతో పొత్తులు పెట్టుకోవాలనే ఆలోచనతోనే ప్రధాని మోడీ ఆయనను కలిసి ఉండవచ్చని వార్తలు వచ్చాయి. కానీ అంతకంటే ముందుగానే డిఎంకె నుంచి సానుకూలమైన స్పందన రావడం విశేషం.
పాత పెద్దనోట్లను రద్దు చేసి రేపటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్, భాజపా వ్యతిరేక పార్టీలు ‘బ్లాక్ డే’ పేరుతో పెద్ద ఎత్తున ధర్నాలు, సభలు, సమావేశాలు నిర్వహించి కేంద్రప్రభుత్వానికి తమ నిరసనలు తెలపాలని నిర్ణయించుకొన్నాయి. ఆ నిరసన కార్యక్రమాలలో తమ పార్టీ కూడా పాల్గొంటుందని డిఎంకె ఇదివరకే ప్రకటించింది. కానీ ప్రధాని మోడీ- కరుణానిధి భేటీ తరువాత, దాని ఆలోచనలో మార్పు వచ్చింది. ఇటీవల రాష్ట్రంలో కురిసిన బారీ వర్షాల కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నందున రేపటి నిరసన కార్యక్రమాలలో పాల్గొనకూడదని నిర్ణయించినట్లు ఆ పార్టీ ప్రకటించింది. కారణం ఏదైతేనేమి, మోడీ వ్యూహం ఆశించిన ఫలితం సాధించినట్లే కనబడుతోంది. అయితే భవిష్యత్ రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని వర్షాలు పడని కొన్ని జిల్లాలలో నామమాత్రంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది.