త్వరలో రేవంత్ రెడ్డి పాదయాత్ర?

ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి త్వరలో చేవెళ్ళ నుంచి రాష్ట్రమంతటా పాదయాత్ర చేయడానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి చేవెళ్ళ నుంచి పాదయాత్ర ప్రారంభించడం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. అయన ఈరోజు సికింద్రాబాద్ లోని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ నివాసంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను కలుసుకొని వారిని పరిచయం చేసుకొన్నారు. తన పాదయాత్రకు పార్టీలో అందరి మద్దతు, సహకారం పొందేందుకే రేవంత్ రెడ్డి పార్టీ నేతలను వరుసగా కలుస్తున్నారనే అభిప్రాయం వినబడుతోంది. 

అయితే రెండు నెలల క్రితం సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్ర గానీ నల్లగొండలో బహిరంగ సభగానీ ఏర్పాటు చేయాలనుకొన్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానం అనుమతించలేదు. అప్పుడు పార్టీ నేతలు అందరూ కలిసి బస్సు యాత్రతో సరిపెట్టుకొన్నారు. కనుక ఇప్పుడు పార్టీలో కొత్తగా చేరిన రేవంత్ రెడ్డికి పాదయాత్రకు అనుమతీస్తే పార్టీలో కోమటిరెడ్డి వంటివారు తప్పకుండా ప్రశ్నించకమానరు. పది రోజుల క్రితం పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ‘బాహుబలి’ గా ఎదగాలని ప్రయత్నించినట్లయితే, సీనియర్ కాంగ్రెస్ నేతలు చూస్తూ ఊరుకొంటారా?అంటే అనుమానమే. 

కానీ రేవంత్ రెడ్డి హడావుడి చూస్తుంటే, ఆయన పాదయాత్రకు రాహుల్ గాంధీ ముందే అనుమతి మంజూరు చేసినట్లు అనుమానం కలుగుతోంది. ఎంతసేపు టికెట్లు, పదవుల గురించి మాత్రమే ఆలోచించే టి-కాంగ్రెస్ నేతలకంటే, ముఖ్యమంత్రి కెసిఆర్ పై పగతో రగిలిపోతూ అయన గద్దె దించుతానని శపధం చేసిన రేవంత్ రెడ్డి అయితేనే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించగలరని భావిస్తున్నారేమో? ఏమో..పాదయాత్ర మొదలుపెడితేగానీ తెలీదు.