తెరాసలో ఉండగా విజయశాంతి తరచూ మీడియాలో కనిపించేవారు కానీ అంతకంటే ఎక్కువ స్వేచ్చ కలిగిన కాంగ్రెస్ పార్టీలోకి మారిన తరువాత ఆమె కనుమరుగైపోవడం ఆశ్చర్యకరం. మళ్ళీ చాలా రోజుల తరువాత ఆమె మంగళవారం పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి డిల్లీ వెళ్ళి పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ రామచంద్ర కుంతియా కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఆమె సేవలను ఉపయోగించుకోవాలనే వారి సూచనకు రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఆమెను రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీలో సభ్యురాలుగా నియమించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీతో సమావేశం అనంతరం ఆమె డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “పార్టీలో ఒక సామాన్య కార్యకర్తలాగ పనిచేసేందుకు నేను సిద్దంగా ఉన్నానని మా పార్టీ ఉపాధ్యక్షుడికి తెలిపాను,” అని చెప్పారు.
వచ్చే ఎన్నికలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైనవి కనుక, ఇప్పటి నుంచే అందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే పార్టీ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. కనుక మరొక ఐదారు నెలలలో కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలు, టికెట్స్ కోలాహలం ప్రారంభం అయిపోవచ్చు.