యూనివర్సల్ హీరో అని పేరొందిన విలక్షణ నటుడు కమల్ హాసన్ పుట్టినరోజు ఈరోజు. కనుక ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి, ఆ కార్యక్రమంలోనే తన రాజకీయ పార్టీ పేరు, వివరాలను ప్రకటించబోతున్నారని అందరూ ఆశించారు. కానీ, ఇటీవల చెన్నైలో కురిసిన బారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమయ్యి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుండటంతో, అయన తన పుట్టినరోజు వేడుకలను వాయిదా వేసుకొని దక్షిణ చెన్నైలో వరద బాధిత ప్రాంతాలలో పర్యటించి ప్రజలను పరామర్శించనున్నారు. కనుక ఇవ్వాళ్ళ ఆయన పుట్టినరోజు ఎటువంటి హడావుడీ లేకుండా పూర్తికాబోతోంది.
కమల్ హాసన్ ప్రస్తుతం సినిమాల కంటే రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నప్పటికీ, స్వంత పార్టీతో ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడానికి ఇంకా ఏర్పాట్లు పూర్తికాకపోవడంతో దానికి కనీసం మరో 10 నెలల సమయం పట్టవచ్చని అన్నారు. కానీ ఇవ్వాళ్ళ తన రాజకీయ ప్రవేశానికి సంబంధించి ఒక మొబైల్ యాప్ విడుదల చేయబోతున్నారని సమాచారం.