ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు పార్లమెంటులో చట్టబద్దత కల్పించాలని కోరుతూ ఏమ్మార్పిఎస్ అధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో అపశ్రుతి జరిగింది. ఆందోళన కార్యక్రమంలో కార్యకర్తలకు, పోలీసులకు మద్య జరిగిన తోపులాటలో భారతి అనే మహిళా కార్యకర్త హటాత్తుగా స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఆమె మరణించింది. ఈ విషయం తెలిసి ఆందోళన చేస్తున్న ఏమ్మార్పిఎస్ కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
శాసనసభలో ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఈవిషయం తెలియడంతో ఆయనే శాసన సభ్యులకు ఈవిషయం తెలియజేయడంతో అందరూ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి 25 లక్షలు ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తునట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించడంతో అధికార, ప్రతిపక్షాలు ఆయన నిర్ణయాన్ని స్వాగతించాయి. ఆమె కుటుంబ సభ్యులలో ఎవరికైనా ప్రభుత్వంలో ఉద్యోగం కల్పించాలని ప్రతిపక్షాలు చేసిన విజ్ఞప్తికి సైతం ముఖ్యమంత్రి కెసిఆర్ సానుకూలంగా స్పందించారు. ఆమె కుటుంబంలో అర్హత కలిగినవారెవారైనా ఉన్నట్లయితే తప్పకుండా తగిన ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కె జానారెడ్డి సూచన మేరకు భారతి మృతికి సంతాపంగా సభను రేపటికి వాయిదావేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.