సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ తెలంగాణాలో రాజకీయ పార్టీల హడావుడి క్రమంగా పెరుగుతోంది. రాజకీయ నేతల కప్పగంతులు మొదలవుతున్నాయి. కొత్తగా అనేక పార్టీలు పుట్టుకొస్తున్నాయి. వాటిలో భాగంగానే లోక్ జనశక్తి పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం మధ్యాహ్నం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు జాగీర్దార్ గ్యారా ప్రతాప్ పటేల్ పార్టీ సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో లోక్ జనశక్తి పార్టీ ప్రజా సంఘలా సహకారంతో రాష్ట్రంలో అన్ని శాసనసభ స్థానాలకు పోటీ చేస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకొందామని పిలుపునిచ్చారు.
తెలంగాణాలో మరో 20-25 ఏళ్ళు తామే అధికారంలో ఉంటామని తెరాస బల్లగుద్ది చెపుతోంది. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీఏ విజయం సాధించి తప్పకుండా అధికారంకి వస్తుందని ఆ పార్టీ నేతలు కూడా బల్లగుద్ది చెప్పుకొంటున్నారు. భాజపా కూడా కేవలం మోడీ నామస్మరణతోనే రాష్ట్రంలో అధికారంలోకి రావడం తధ్యమని చెప్పుకొంటున్నాయి. కనుక వచ్చే ఎన్నికలు ఆ పార్టీలన్నిటికీ జీవన్మరణ సమస్య వంటివే గనుక వాటి మద్య భీకరమైన పోరు జరిగే అవకాశం ఉంది.
అసలు తెలంగాణాలో ఎంతమందికి ఈ పార్టీ ఒకటి ఉందని తెలుసు? అనే సందేహం కూడా కలుగుతుంది. ఇటువంటి పరిస్థితులలో తెలంగాణాలో కనీసం తన ఉనికిని కూడా చాటుకోలేకపోతున్న పార్టీలు అన్ని స్థానాలకు పోటీ చేయడం వలన ఏమి ప్రయోజనం ఉంటుంది? ప్రజలు అటువంటి వాటిని పట్టించుకొంటారా? అంటే అనుమానమే.