సింధుకు ఇండిగో ఘాటు జవాబు

రియో ఒలింపిక్స్ లో వెండి పథకం సాధించిన ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధుకు హైదరాబాద్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ఇండిగో ఎయిర్ లైన్స్ గ్రౌండ్ స్టాఫ్ అజితేష్ అనే వ్యక్తి తనతో చాలా దురుసుగా వ్యవహరించారని, ఇండిగో ఎయిర్ లైన్స్ ఎయిర్ హాస్టస్ అతనిని వారిస్తున్నా వినకుండా ఆమెపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని, ఇటువంటి వ్యక్తులను ఉద్యోగులుగా నియమించుకొంటే ఎయిర్ లైన్స్ ప్రతిష్ట దెబ్బ తింటుంది,” అని సింధు ట్వీట్ చేశారు. 

శనివారం మధ్యాహ్నం ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన 6ఈ 608 విమానంలో హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళేటప్పుడు ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది. 

ఆమె ట్వీట్ పై ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ కూడా వెంటనే స్పందిస్తూ తప్పు ఆమెదేనని తేల్చి చెప్పడం విశేషం. “విమానంలో హ్యాండ్ లగేజి మాత్రమే అనుమతిస్తారు కానీ సింధు చాలా అధిక లగేజీతో విమానంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అప్పుడు మా ఉద్యోగి అజితేష్ ఆమెను వారించారు. అధనంగా ఉన్న లగేజిని కార్గోలో వేయాలని కోరారు. అయన పదేపదే చెపుతున్నా ఆమె అందుకు అంగీకరించకుండా ఆయనతో వాగ్వాదానికి దిగారు. చివరికి కార్గోలో వేయడానికి అంగీకరించారు. ఆమెతో మా ఉద్యోగులు అనుచితంగా వ్యవహరించలేదు,” అని జవాబు ఇచ్చింది.