ఒకప్పుడు 10 జిల్లాలుగా ఉండే తెలంగాణా రాష్ట్రాని ప్రజల సౌకర్యం, పాలనా సౌలభ్యం కోసం 31 జిల్లాలుగా పునర్వ్యవస్తీకరించింది తెలంగాణా ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు అధికార వికేంద్రీకరణ కోసం ప్రస్తుతం ఉన్న 8600 గ్రామ పంచాయితీలకు అదనంగా మరో 4,000 కొత్త పంచాయితీలను ఏర్పాటు చేసి, పంచాయితీ వ్యవస్థను కూడా పునర్వ్యవస్థీకరించడానికి కసరత్తు మొదలుపెట్టింది.
కొన్నిరోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనలకు వెళ్ళినప్పుడు గోండు, కోయగూడేలు, చెంచులు మొదలైన గిరిజన తండాలను పంచాయితీలుగా ఏర్పాటు చేస్తానని చెప్పారు. 500 మంది జనాభాకు ఒక పంచాయితీ చొప్పున రాష్ట్రంలో కొత్తగా మరో 4-5,000 పంచాయితీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వాటి ఏర్పాటు కోసం ఇప్పటికే అధికారులు కసరత్తు మొదలుపెట్టి పంచాయితీలుగా మార్చడానికి అర్హత గల 1,757 తండాలను గుర్తించారు. త్వరలోనే మిగిలినవాటిని కూడా గుర్తించి పంచాయితీలు ఏర్పాటు చేస్తామని పంచాయితీరాజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు నిన్న శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు. ప్రజల సౌకర్యమే ప్రాతిపదికగా అవసరమైనన్ని కొత్త పంచాయితీలు ఏర్పాటు చేయాలని తెలంగాణా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి జూపల్లి చెప్పారు. కొత్త పంచాయితీలను ఏర్పాటు చేసిన తరువాతే పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలనుకొంటున్నట్లు తెలిపారు. వీటి ఏర్పటుకు అవసరమైన ప్రతిపాదనలు పంపవలసిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ్యులను కోరారు. వీటి ఏర్పాటు కోసం ఈ శీతాకాల శాసనసభ సమావేశాలు ముగిసేలోపే బిల్లు ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి తెలిపారు.