ఆ బస్ కండక్టర్ పై సస్పెన్షన్ వేటు

నిజామాబాద్ జిల్లా ఆర్టీసి డిపో-1 కి చెందిన కండక్టర్ డి.సంజీవ్, సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల సమయంలో టిబిజికెఎస్ తరపున తెరాస సర్కార్ ఇస్తున్న హామీలపై స్పందిస్తూ ఫేస్ బుక్ లో కొన్ని పోస్టులు పెట్టారు. రూ.250 కోట్లు ఇచ్చి ఆర్టీసిని ఆదుకొన్నట్లే సింగరేణిని కార్మికులను కూడా ఆదుకొంటామని తెరాస నేతలు హామీలు గుప్పించడాన్ని ఆయన తప్పుపడుతూ, “జి.హెచ్.ఎం.సి.నుంచి ఆర్టీసికి రూ.250 కోట్లు ఇచ్చిన్నట్లు తెరాస సర్కార్ చెపుతున్న మాటలు అబద్దం. ఆర్టీసికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఆర్టీసికి హామీ ఇచ్చినట్లే ఇప్పుడు సింగరేణి కార్మికులకు కూడా తెరాస నేతలు హామీలు గుప్పిస్తున్నారు,” అని మెసేజ్ పెట్టారు.

తెరాస సర్కార్ తీరును విమర్శిస్తూ ఆయన మరికొన్ని పోస్టులు పెట్టడంతో సహజంగానే తెరాస పెద్దలకు ఆగ్రహం కలిగింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు టిఎస్.ఆర్టీసి. ఉన్నతాధికారులు విచారణ చేపట్టి కండక్టర్ డి.సంజీవ్ చేసిన ఆరోపణలు వాస్తవవిరుద్దంగా ఉన్నాయని, అతను ఉద్దేశ్యపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశాడని అభిప్రాయం వ్యక్తం చేసి, తదనుగుణంగా నివేదిక రూపొందించారు. ఆ నివేదిక ఆధారంగా కండక్టర్ డి.సంజీవ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.

దీనిపై సంజీవ్ స్పందిస్తూ, “ప్రజాభిప్రాయం వినేందుకు కూడా ఈ ప్రభుత్వం ఇష్టపడటం లేదు పైగా ఈవిధంగా గొంతునొక్కే ప్రయత్నం చేస్తోంది. ఇది చాలా దురదృష్టకరం,” అని అన్నారు. ఆయనకు మద్దతుగా ఈరోజు నిజామాబాద్ ఆర్టీసిలో బహుజన్ వర్కర్స్ యూనియన్ కార్మిక సంఘం ఉద్యోగులు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యి తమ నిరసనలు తెలియజేస్తున్నారు.