కేసీఆర్ ను గద్దె దించడానికే తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని రేవంత్ రెడ్డి చెపుతున్న మాటలపై స్పందించడానికి తెరాస కొంత సమయం తీసుకొన్నప్పటికీ, ఇప్పుడు ఆయనపై పూర్తి స్థాయి యుద్ధం ప్రకటించేసింది. దానిలో భాగంగా మొదట రేవంత్ రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో తెదేపా, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలను బుధవారం తెరాసలో చేర్చుకొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “తెరాసది కుటుంబ పాలన అని విమర్శిస్తున్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు సాగుతున్న కుటుంబపాలన కనిపించడం లేదా? కాంగ్రెస్ పార్టీ ఒక ఎ-టు-జెడ్ కుంభకోణాల పార్టీ. దానిలో రేవంత్ రెడ్డి అనే మరొక గజదొంగ చేరాడు కొత్తగా. ఓటుకు నోటు కేసులో సాక్ష్యాధారాలతో సహా పట్టుబడి జైలుకు వెళ్ళి కొడంగల్ ప్రజల పరువు తీశాడు. జైలులో చిప్పకూడు తినివచ్చినా ఆయనకు ఇంకా బుద్ధి రాలేదు. అటువంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకొని అదేదో గొప్ప విషయం అన్నట్లు కాంగ్రెస్ నేతలు సంబరపడటం సిగ్గు చేటు. రేవంత్ రెడ్డి మా కోటలను కూల్చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. అయన మాకోట గోడ కాదు కదా..దాని సున్నం కూడా పీకలేడు. అయినా మాకు ఎటువంటి కోటలు లేవు. ప్రజల హృదయాలలోనే కేసీఆర్ కొలువున్నారు. ఆయనను ఎదిరించడం కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు...రేవంత్ రెడ్డి వల్ల అసలే కాదు. తెరాసను డ్డీ కొని నిలబడటం రాహుల్ గాంధీ కాదు కదా ఆయన జేజెమ్మ తరం కూడా కాదు. వచ్చే ఎన్నికల తరువాత తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనిపించకుండాపోతుంది. ఈసారి మా జైత్రయాత్రను కొడంగల్ నుంచే ప్రారంభించబోతున్నాము,” అని కేటిఆర్ అన్నారు.