ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాయ్ బరేలీ జిల్లాలోని ఉంచ్చార్ అనే ప్రాంతంలో గల ఫిరోజ్ గాంధీ నేషనల్ ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఈరోజు మధ్యాహ్నం పెను ప్రమాదం జరిగింది. ప్లాంట్ లోని బాయిలర్ పైపులు పేలిపోవడంతో ఆ ప్రాంతంలో పనిచేస్తున్న 15 మంది కార్మికులు అక్కడిక్కడే చనిపోగా, నలుగురు అసిస్టెంట్ జనరల్ మేనేజర్లతో సహా మొత్తం 100 మంది గాయపడ్డారు. వారిలో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. ఈవిషయం తెలియగానే, జిల్లా అధికారులు జిల్లాలోని అన్ని అంబులెన్స్ లను రప్పించి గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు ప్లాంట్ లో సుమారు 1500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు సుమారు 100 కిమీ దూరంలో ఉన్న ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 500 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.