కేసీఆర్ షాకింగ్ రిప్లై

బైసన్ పోలో గ్రౌండ్స్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించదలచుకొన్న కొత్త సచివాలయం గురించి ఇవ్వాళ్ళ శాసనసభలో జరిగిన చర్చలో భాజపా ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, కె.లక్ష్మణ్ అనేక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రజా సమస్యలను, ప్రాధాన్యతలను పట్టించుకోకుండా తన ఇష్టం వచ్చినట్లు ప్రజాధనం ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్రా, తెలంగాణాలకు సరిపోయిన సచివాలయం ఇప్పుడు తెలంగాణా ఒక్కదానికి సరిపోదా? అని ప్రశ్నించారు. అగ్నిమాపక సాధనాలు, పార్కింగ్ సౌకర్యం సరిగ్గా లేదన్న కేసీఆర్ వాదనలను ఖండిస్తూ, అవసరమనుకొంటే అవన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు కదా..అవి లేవని కొత్త సచివాలయం నిర్మించడం దేనికని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు ఇది పూర్తి విరుద్దంగా ఉందని అన్నారు. తెరాస సర్కార్ కొత్త సచివాలయం నిర్మించాలనుకొంటున్న స్థలం క్రీడా మైదానం అని, దానిని కప్పిపెట్టి సచివాలయం కడితే చూస్తూ ఊరుకోమన్నారు. ప్రస్తుతం ఉన్న సువిశాలమైన సచివాలయాన్నే అవసరమైన మార్పులు చేర్పు చేసి వాడుకోవాలని సూచించారు. 

దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన సమాధానం విని కాంగ్రెస్, భాజపా ఎమ్మెల్యేలు విని షాక్ అయ్యారు. “ఈ దేశంలో గల అన్ని రాష్ట్రాల సచివాలయాలలోకి ఇదే అతిచెత్త సచివాలయం. గత పాలకులు ఒక పద్దతీ పాడు లేకుండా దానిని ఇష్టం వచ్చినట్లు కట్టుకొంటూపోయారు. ఆ కారణంగా సచివాలయంలో ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగినట్లయితే అక్కడికి అగ్నిమాపకదళాలు కూడా చేరుకోలేని దుస్తితి నెలకొని ఉంది. ఇక సి బ్లాకులోగల సిఎం కార్యాలయం పక్కన నడిచేందుకు కూడా తగినంత దారిలేదు. గట్టిగా పదికార్లు పార్కింగ్ చేసుకొనే సౌకర్యం లేదు. అందుకే తెలంగాణా రాష్ట్ర గౌరవం ఇనుమడించేవిధంగా అన్ని హంగులతో అత్యాధునికమైన సచివాలయం నిర్మించాలనుకొంటున్నాను. 

బైసన్ పోలో గ్రౌండ్స్ ఆర్మీకి చెందిన క్రీడా మైదానమే తప్ప సామాన్య ప్రజల కోసం ఉద్దేశ్యించినది కాదని మీకు తెలియదా? సమైక్య రాష్ట్రానికి 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంగల సచివాలయం అవసరమైనప్పుడు, తెలంగాణా రాష్ట్రానికి 5లక్షల అడుగుల విస్తీర్ణంగల సచివాలయం అవసరం ఉండదా? ఇప్పుడు ఒకసారి కొత్త సచివాలయం కట్టుకొంటే మళ్ళీ మరో 100 సంవత్సరాలు చూసుకోనవసరం లేకుండా కడతాము. 100 సంవత్సరాలు ఉండాల్సిన సచివాలయానికి ఓ రూ.182 కోట్లు ఖర్చు పెడితే తప్పేమిటి? 

మేము ఏది కట్టాలో ఏది వద్దో మీరు చెప్పేమాటయితే ఇక మేమెందుకు? ప్రజలు మమ్మల్ని ఎన్నుకొని ఈ రాష్ట్రాన్ని పాలించమని మాకు అధికారం ఇచ్చారు. కనుక ఈ రాష్ట్రానికి, ప్రజలకు ఏది మంచో అది మేము చేసి తీరుతాము. ప్రతిపక్షాలు ఔనన్నా కాదన్నా కేంద్రం మాకు బైసన్ పోలో గ్రౌండ్స్ అప్పగించిన మరుక్షణం అక్కడ కొత్త సచివాలయానికి ప్రధాని నరేంద్ర మోడీ చేతే శంఖుస్థాపన చేయిస్తాము. అక్కడే కొత్త సచివాలయం కట్టి తీరుతాము. ఎవరు అడ్డుకొంటారో మేము చూస్తాం,” అని ఘాటుగా జవాబిచ్చారు.

ముగింపుగా అయన చెప్పిన మాట ఇంకా షాకింగ్ గా ఉంది. కొత్త సచివాలయానికి భాజపా ఎమ్మెల్యేలు అభ్యంతరం చెపుతుంటే,  ప్రధాని నరేంద్ర మోడీ చేతే దానికి శంఖుస్థాపన చేయిస్తానని కేసీఆర్ చెప్పడం భాజపా ఎమ్మేల్యేలకు పెద్ద షాకే కదా!