కాంగ్రెస్, భాజపాలపై ఒవైసీ విమర్శలు

తెలంగాణా శాసనసభ సమావేశాలు మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్, భాజపా సభ్యులు రోజూ ఏవో కొన్ని అంశాల మీద వాయిదా తీర్మానం ఇవ్వడం వాటిని స్పీకర్ నిరాకరించడం, దాంతో వారు సభలో కాసేపు గందరగోళం సృష్టించి, ఆ తరువాత నిరసన తెలుపుతూ సభ నుంచి వాక్-అవుట్ చేయడం నిత్యకృత్యమైపోయింది. 

మజ్లీస్ పార్టీ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ వారి తీరు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “సభ మొదలవగానే వారు రోజూ ఏవో కొన్ని అంశాల మీద వాయిదా తీర్మానం ఇచ్చి, ముందుగా వాటిపై అత్యవసరంగా చర్చ చేపట్టాలని డిమాండ్ చేయడం సరికాదు. సభ నిర్వహణకు కొన్ని పద్దతులు, సంప్రదాయాలు ఉన్నాయి. వాటిని అందరూ తప్పనిసరిగా పాటించాలి తప్ప మేము కోరుకొన్నట్లుగానే సభ నడవాలని డిమాండ్ చేయడం సరికాదు. వారు చెప్పినట్లు మొదట వాయిదా తీర్మానాలు చేపడితే చేస్తే ఇక ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఎప్పుడు చేపట్టాలి? సభా సాంప్రదాయాల ప్రకారం మొదట ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించి, దాని తరువాత ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలు చేపడతామని స్పీకర్ చెపుతున్నప్పటికీ కాంగ్రెస్, భాజపా సభ్యులు సభలో గొడవ చేయడం సరికాదు,” అని అన్నారు అసదుద్దీన్ ఓవైసి. 

కాంగ్రెస్ తీరుపట్ల మంత్రి హరీష్ రావు కూడా నిన్న అభ్యంతరం చెప్పారు. వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చిన తరువాత దానిని స్పీకర్ అంగీకరిస్తారో లేదో కూడా తెలుసుకోకుండా కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాక్- అవుట్ చేయడం ఏమి పద్దతని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె జానారెడ్డిని ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానం ఇవ్వకుండా వాక్-అవుట్ చేశారు.