మరో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం

ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే రాజకీయ నేతల పార్టీ ఫిరాయింపులు..కొత్త కొత్త రాజకీయ పార్టీల ప్రారంభాలు.. పొత్తుల లెక్కలు...కనిపిస్తుంటాయి. తెలంగాణాలో రేవంత్ రెడ్డి అండ్ కో నిన్ననే డిల్లీ వెళ్లి కాంగ్రెస్ కండువాలు తెచ్చుకొన్నారు. మెగాపవర్ స్టార్ పవన్ కళ్యాణ్  వచ్చే మార్చిలో సినిమాలకు గుడ్ బై చెప్పేసి జనసేనతో జనాల మద్యకు వచ్చేస్తున్నాడు. ఏపిలో అన్ని స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించేసి, మళ్ళీ తెదేపాతో కమిట్ అయిన సంగతి గుర్తుకు వచ్చి తూచ్..బలం ఉన్న స్థానాలలోనే పోటీ చేస్తామని సవరణ ప్రకటన చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ మనసులో మాట తెదేపాకు చెప్పకనే చెప్పేశారు.   

ఇక తమిళనాడులో రజనీకాంత్ రాజకీయ పార్టీ స్థాపించడం కోసం (పైనున్న ఆ భగవంతుడి అనుమతి కోసం) ఇంకా ఆకాశం వైపు చూస్తూనే ఉన్నారు. ఈలోగా సోషలిజం..హేతువాదం గురించి మాట్లాడే కమల్ హాసన్ తన పుట్టిన రోజున (నవంబర్ 7న) కొత్త రాజకీయ పార్టీ ప్రకటించేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొంటూ అధికార అన్నాడిఎంకె, భాజపాల మీద సెటైర్లు వేస్తున్నారు. 

ప్రముఖ కన్నడ హీరో ఉపేంద్ర చడీచప్పుడు లేకుండా మంగళవారం ‘కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పక్ష’ పార్టీ (కెపిజెపి)ని ప్రారంభించేసారు. అంతటితో ఊరుకోకుండా 2018లో జరుగబోయే కర్ణాటక శాసనసభ ఎన్నికలలో మొత్తం 224 స్థానాలకు పోటీ చేస్తానని ప్రకటించేసి అధికార కాంగ్రెస్, విపక్ష భాజపాలకు గుబులు పుట్టిస్తున్నారు.

తెలంగాణాలో తెరాసకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఎదుగుతున్నట్లు కనిపిస్తోంది. వామ పక్షాలు, గద్దర్, ప్రొఫెసర్ కోదండరామ్ వంటివారు అటుతిరిగి..ఇటు తిరిగి చివరికి దాని పంచనే చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక మోడీ నామస్మరణతో బొందితో కైలాసం కూడా వెళ్లిపోవచ్చునని నమ్ముతున్న టి-భాజపా, వచ్చే ఎన్నికలలో గౌరవం కాపాడుకోవడం కోసం కుదిరితే తెరాసతో లేకుంటే మళ్ళీ అవశేష తెదేపాతో పొత్తులు పెట్టుకొనే ఆలోచన చేయక తప్పదు. ప్రస్తుతానికి పొత్తులు..కొత్త పార్టీల సమాచార్ ఇంతే!