సింగరేణి హామీల అమలుకు సన్నాహాలు

ఇటీవల జరిగిన సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల సమయంలో టిబిజికెఎస్ తరపున ఆ సంఘం గౌరవాధ్యక్షురాలు తెరాస ఎంపి కవిత మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులకు అనేక హామీలు ఇచ్చారు. వాటిలో కారుణ్యనియామకాలు కూడా ఒకటి. 

దానిలో భాగంగా అనారోగ్య కారణాలతో స్వచ్చందంగా పదవీ విరమణ చేయదలచుకొన్న కార్మికులకు, విధి నిర్వహణలో ఉండగా మరణించిన వారి కుటుంబాలకు ఏకమొత్తంగా రూ.25 లక్షలు కానీ లేదా నెలకు రూ.25,000 పెన్షన్ కానీ అందిస్తామని హామీ ఇచ్చారు.

సింగరేణి సిఎండి ఎన్.శ్రీధర్ అధ్యక్షతన సోమవారం సింగరేణి భవన్ లో బోర్డు సమావేశం నిర్వహించారు. దానిలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపి కవిత ఇచ్చిన ఆ హామీకి బోర్డు ఆమోదముద్ర వేసింది. దానిని అమలు కోసం త్వరలోనే మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేస్తామని శ్రీధర్ చెప్పారు. 

ఇక కార్మికుల తల్లితండ్రులకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో వైద్యసేవలు అందిస్తామని టిబిజికెఎస్  గౌరవాధ్యక్షురాలు కవిత ఇచ్చిన హామీ అమలుకు కూడా బోర్డు సభ్యులు ఆమోదముద్ర వేశారు. అలాగే 18 ఏళ్ళలోపు వయసు కలిగిన మహిళా ఉద్యోగునులకు వారి అవసరాలను బట్టి గరిష్టంగా 24 నెలలు శలవు (చైల్డ్ కేర్ లీవ్) ఇస్తామన్న కవిత హామీకి కూడా బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే బిఆర్ అంబేద్కర్ జయంతిని (ఏప్రిల్ 14) వేతనంతో కూడిన శలవు దినంగా అమలుచేసేందుకు ఆమోదముద్ర వేసింది. 

సింగరేణి ఎన్నికలు ముగిసిన నెలరోజులు గడువక మునుపే తెరాస సర్కార్ హామీల అమలు చేయడం అభినందనీయం. ముఖ్యంగా మెడికల్ అన్-ఫిట్, మరియు విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు ఈ నిర్ణయాలు చాలా ఉపశమనం కలుగజేస్తాయి.