సోమవారం తెల్లవారుజామున ముంబై నుంచి డిల్లీ బయలుదేరిన జెట్ ఎయిర్ వేస్ విమానం టాయిలెట్ రూమ్ లో దొరికిన ఒక లేఖలో ఆ విమానం హైజాక్ చేయబడిందని, దానిని పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు తీసుకువెళ్ళమని హెచ్చరికలున్నాయి. అది చూసి అప్రమత్తమైన పైలెట్లు సమీపంలోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశారు.
విమానంలో ప్రయాణికులందరినీ క్షేమంగా బయటకు తరలించి వారిని ఒక్కొక్కరినీ ప్రశ్నించగా వారిలో బిర్జు కిశోర్ సల్లా అనే ప్రయాణికుడు ఈ లేఖ వ్రాసిపెట్టిన్నట్లు అధికారులు కనుగొన్నారు. అతనొక వ్యాపారస్తుడు. జెట్ ఎయిర్ వేస్ లో తరచూ ప్రయాణిస్తుంటాడు. ఆ క్రమంలో అతను జెట్ ఎయిర్ వేస్ లో పనిచేస్తున్న ఒక ఎయిర్ హోస్టెస్ తో ప్రేమలో పడ్డాడు. ఆమె ఉద్యోగం ఊడగొట్టి తన సంస్థలోకి రప్పించుకొనేందుకు ఒకసారి విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆహారం విషయంలో గొడవ పెట్టుకొన్నాడు. కానీ అతని ఆలోచన ఫలించకపోవడంతో అప్పటి నుంచి ఆ సంస్థపై ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్నాడని విచారణలో తేలింది. ఆ ప్రయత్నంలోనే నిన్న ఈ హైజాక్ డ్రామా ఆడినట్లు విచారణలో తేలింది. అతనికి కాస్త మతిస్థిమితం లేదనే విషయాన్ని అధికారులు గుర్తించారు. అతను విమానాలలో ప్రయాణించకుండా నిషేధం విధిస్తున్నట్లు పౌరవిమానయాన శాఖ ప్రకటించింది.