రేవంత్ సమావేశంలో ఉత్తం, మల్లు

రేవంత్ రెడ్డి రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నందున ఈరోజు జూబ్లీ హిల్స్ లోగల తన నివాసంలో తన అనుచరులతో ఆత్మీయసభ నిర్వహించారు. విశేషమేమిటంటే ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లురవి కూడా హాజరయ్యారు. 

తాము కాంగ్రెస్ అధిష్టానం తరపున రేవంత్ రెడ్డిని, ఆయన అనుచరులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకే ఈ సమావేశానికి వచ్చామని చెప్పారు. తెరాస సర్కార్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటంలో రేవంత్ రెడ్డి కూడా భాగస్వామికావడం చాలా సంతోషం కలిగిస్తోందన్నారు. తెరాస సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నవారందరికీ కాంగ్రెస్ పార్టీ సాదరంగా ఆహ్వానిస్తోందని ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. 

ఈ ఆత్మీయసమావేశంలో రేవంత్ రెడ్డి అప్పుడే అచ్చమైన కాంగ్రెస్ నేతలాగ సోనియా గాంధీ త్యాగాల గురించి మాట్లాడటం విశేషం. “ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఆమె రాజకీయాలను పక్కనబెట్టి తెలంగాణా ఇచ్చారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమె ఆంధ్రప్రదేశ్ లో తన కాంగ్రెస్ పార్టీని పణంగా పెట్టారు. తెలంగాణా ఇచ్చేవరకు ఆమె కాళ్ళకు మ్రొక్కిన కేసీఆర్, తెలంగాణా ఏర్పాటుకాగానే నమ్మకద్రోహానికి పాల్పడ్డారు. ఏ ఆశయాలు, ఆకాంక్షల కోసం తెలంగాణా సాధించుకొన్నామో అందుకు భిన్నంగా కేసీఆర్ పాలన సాగుతోంది. కేసీఆర్ నియంతృత్వపాలనను అంతమొందించి నిజమైన బంగారి తెలంగాణా ఏర్పరచుకోవడానికి మళ్ళీ అందరం కలిసి మరోసారి ఉద్యమించవలసిన సమయం ఆసన్నమైంది. తెలంగాణా ప్రజలు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోనేందుకే నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను,” అని చెప్పారు. 

రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులు రేపు డిల్లీ వెళ్లి మధ్యాహ్నం 12.30 గంటలకు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు.