జెట్ ఎయిర్ వేస్ కు ఉగ్రహెచ్చరికలు

ముంబై నుంచి డిల్లీ వెళుతున్న జెట్ ఎయిర్ వేస్ విమానం టాయిలెట్ లో ఒక కాగితం ముక్కపై వ్రాసి ఉన్న హెచ్చరికతో అప్రమత్తమైన పైలట్, విమానాన్ని అత్యవసరంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి మళ్ళించారు. ఆ సమయంలో విమానంలో మొత్తం 115 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు.

సోమవారం తెల్లవారు జామున 2.55 గంటలకు జెట్ ఎయిర్ వేస్ విమానం ముంబై నుంచి డిల్లీకి బయలుదేరిన కాసేపటికే విమానం టాయిలెట్ లో ఒక ప్రయాణికుడికి ఒక కాగితం లభించింది. దానిలో “విమానంలో 12 మంది హైజాకర్లు ఉన్నారు. విమానాన్ని నేరుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు తీసుకువెళ్ళాలి. అలాకాక డిల్లీలో ల్యాండ్ చేయదలిస్తే విమానాన్ని బాంబులతో పేల్చివేయబడుతుంది. ఇది జోక్ కాదు. నిజమైన హెచ్చరిక. కాదని ముందుకు సాగితే ఫలితం అనుభవించవలసి ఉంటుంది,” అని ఆ లేఖలో వ్రాయబడి ఉంది. 

దానిని ఆ ప్రయాణికుడు విమాన సిబ్బందికి ఇవ్వడంతో వారు వెంటనే పైలట్లను అప్రమత్తం చేశారు. వారు వెంటనే విమానాన్ని సమీపంలో ఉన్న అహ్మదాబాద్ విమానాశ్రయానికి మళ్ళించి సురక్షితంగా ల్యాండ్ చేసారూ. విమానాశ్రయంలో భద్రతాసిబ్బంది విమానాన్ని చుట్టుముట్టి ప్రయాణికులు అందరినీ బయటకు తరలించారు. అందరినీ ప్రశ్నించి వారందరూ సామాన్య ప్రయాణికులేనని నిర్ధారించుకొన్నారు. విమానంలోపల క్షుణంగా తణికీ చేశారు. కానీ ఎటువంటి అనుమానాస్పదవస్తువులు లభించలేదు. 

ఇది ఎవరో ఆకతాయి చేసిన పని కావచ్చునని అనుమానిస్తున్నారు. కానీ విమానం టాయిలెట్ రూమ్ లో ఆ హెచ్చరికలు వ్రాసిన కాగితం ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? ఎప్పుడు పెట్టారనే విషయం తెలుసుకొనేందుకు దర్యాప్తు చేస్తున్నారు.