మన దేశంలో అతిపెద్ద వ్యవస్థలలో రైల్వేశాఖ మొదటి స్థానంలో నిలుస్తుంది. ప్రపంచ దేశాలలో చైనా జాతీయ పెట్రోలియం గ్రిడ్ లో అత్యధికంగా 16 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దాని తరువాత స్థానం భారతీయ రైల్వేలదే. దానిలో ఇప్పటికే దేశవ్యాప్తంగా 14 లక్షల మంది ఉద్యోగులున్నారు. పరోక్షంగా మరికొన్ని లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాది కల్పిస్తోంది. రానున్న ఐదేళ్ళలో మరో 10 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించడానికి సన్నాహాలు చేస్తున్నామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
రానున్న ఐదేళ్ళలో రూ. 9.75 లక్షల కోట్ల పెట్టుబడితో రైల్వేశాఖ దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు చేపట్టబోతోందని వాటి ద్వారా 10 లక్షల ఉద్యోగాలు ఏర్పడతాయని మంత్రి తెలిపారు. దేశంలో రైల్వే రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడం, దాని కోసం కొత్తగా రైలు మార్గాలను నిర్మించడం, రైల్వే కోచ్, ఇంజన్లు నిర్మాణం కోసం ఫ్యాక్టరీలు, మరమత్తుల కోసం బారీ వర్క్స్ షాపులు ఏర్పాటు చేయడం, టికెటింగ్, సిగ్నలింగ్ వ్యవస్థలను ఆధునీకరించడం వంటి అనేక కార్యక్రమాలను చేపట్టబోతున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
ఉదాహరణకు సరుకు రవాణాకు ‘డెడికేటడ్ రైల్వే లైన్స్, సమాంతర వ్యవస్థలు అవసరమని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. వాటి కోసం విదేశీపెట్టుబడులను ఆహ్వానించింది కూడా. అలాగే అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు జపాన్ సహకారం తో ‘బులెట్ ట్రైన్’ ప్రాజెక్టు చేపట్టబోతోంది. దేశంలో ముఖ్యనగరాలు, పట్టణాల మద్య సెమీ హై స్పీడ్ రైళ్ళను ప్రవేశపెట్టడానికి చురుకుగా సన్నాహాలు చేస్తోంది. వీటన్నటి వలన కొత్తగా అనేక లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చు.
వీటి కోసం నిధుల సమీకరణ ప్రక్రియ కూడా కేంద్రప్రభుత్వం మొదలుపెట్టింది. జీవితభీమా సంస్థ రూ.1.5 లక్షల కోట్లు అప్పుగా ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఇక టాటా, అంబానీ వంటి కార్పోరేట్ సంస్థలు రైల్వే బిజినెస్ లోకి ప్రవేశించాలని ఆసక్తి చూపిస్తున్నాయి. కనుక ఇప్పుడు ప్రైవేట్ ఎయిర్ లైన్స్ తిరుగుతున్నట్లే భవిష్యత్ లో టాటా రైళ్ళు..రిలయన్స్ రైళ్ళు తిరిగినా ఆశ్చర్యం లేదు. కనుక రైల్వే మంత్రి పీయూష్ గోయల్ చెపుతున్న మాటలు కార్యరూపం దాల్చే అవకాశాలు కనబడుతున్నాయి.