వాళ్ళకు ఏదో న్యూస్ కావాలి..ఏదో రాసుకొంటారు..అంతే

ఎన్టీఆర్ జీవితకధ ఆధారంగా ఒకేసారి మూడు బయోపిక్స్ రూపొందబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో మొదటిది రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ కాగా, రెండవది కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ‘లక్ష్మీస్ వీరగ్రందం..(ఆదర్శ గృహిణి)’. ఇక తేజ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మూడవ చిత్రంలో నందమూరి బాలకృష్ణ స్వయంగా తన తండ్రి పాత్రను చేయబోతున్నారు. 

వీటిలో వర్మ తీయబోతున్న సినిమాలో చంద్రబాబును విలన్ గా చూపించబోతున్నట్లు ఇప్పటికే స్పష్టం అయ్యింది. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తీయబోతున్న ‘లక్ష్మీస్ వీరగ్రందం’ సినిమా వర్మ సినిమాకు కౌంటర్ గా తీస్తున్నదని ఆ సినిమా టైటిల్, దాని సబ్-టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ చూస్తేనే అర్ధం అవుతుంది. 

తనను విలన్ గా చూపిస్తూ వర్మ తీయబోయే సినిమాను అడ్డుకొనే ప్రయత్నాలు చేసినట్లయితే దానికి మరింత ఉచిత పబ్లిసిటీ కలుగుతుందని గ్రహించిన చంద్రబాబు నాయుడు, తన పార్టీ నేతలను వారించారు. ఆ తరువాత కొద్ది రోజులకే కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రందం’ సినిమా ప్రకటన వెలువడటం గమనిస్తే చంద్రబాబు చాలా లౌక్యంగా వ్యవహరించారని అర్ధం అవుతోంది. తద్వారా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ఆపే బాధ్యత లక్ష్మీ పార్వతి నెత్తినే పెట్టినట్లయింది. ఆమె ఆ సినిమాను ఆపితే, ‘వీరగ్రందం’ కూడా ఆగుతుందని చెప్పకనే చెప్పినట్లయింది.  

చంద్రబాబు చేతికి మట్టి అంటకుండా ఇచ్చిన ఈ షాక్ తో ఇంతకాలం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా గురించి ముసిముసి నవ్వులు నవ్వుతూ మాట్లాడిన లక్ష్మీ పార్వతి బిత్తరపోయినట్లు కనబడుతున్నారు. ఆమె నిన్న హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “నా పేరుతో, నా జీవితకధను సినిమాగా తీయాలనుకొనేవారు ఎవరైనా సరే తప్పనిసరిగా నా అనుమతి తీసుకోవాలి. అది వర్మ కావచ్చు..మరొకరు కావచ్చు. నన్ను సంప్రదించకుండా, నా అనుమతి తీసుకోకుండా సినిమా తీసినట్లయితే నేను తప్పకుండా కోర్టుకు వెళ్ళి అడ్డుకొంటాను. ఈ సినిమాల గురించి..దానిలో నా పాత్ర గురించి మీడియాలో ఏవేవో వ్రాస్తున్నారు. వాళ్ళకు రోజూ రాసుకోవడానికి ఏదో ఒక మ్యాటర్ కావాలి కనుక వారికి తోచిందేదో వ్రాసుకొంటున్నారు. ఐ పిటీ దెం ఆల్..” అని అన్నారు.