రేవంత్ రెడ్డి తెదేపాకు గుడ్ బై చెప్పేసిన తరువాత టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ మీడియాతో మాట్లాడుతూ, “ఒకప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు మా తెదేపాని ఏవిధంగా చీల్చి దెబ్బ తీయాలని చూశారో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ నేతలతో చేతులు కలిపి మా పార్టీని చీల్చి బలహీనపరచాలని ప్రయత్నిస్తున్నారు. ఆయనను మా పార్టీ ఎంతగానో ఆదరించి, ప్రోత్సహించి ఈ స్థాయికి ఎదిగేందుకు సహకరిస్తే, తల్లిపాలు త్రాగి రొమ్మును గుద్దినట్లు పార్టీకే ద్రోహం చేశారు. తెలంగాణాలో తెదేపాను బలహీనపరచడానికి అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు. ఎందుకంటే, తెదేపా బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీగా ప్రజలలో మంచి ఆదరణ కలిగిఉంది. గతంలో కూడా ఇంతకంటే పెద్ద ఆటుపోట్లను తట్టుకొని నిలబడింది. ఇప్పుడూ నిలబడుతుంది. ఒక్క రేవంత్ రెడ్డి బయటకు పోయినంతమాత్రాన్న పార్టీ ఏమీ అయిపోదు. తెదేపాలో అనేక లక్షల మంది కార్యకర్తలు, వందలమంది ద్వితీయశ్రేణి నాయకులు, డజన్ల మంది సీనియర్ నేతలు ఉన్నారు. కనుక రేవంత్ రెడ్డి తెదేపాను విడిచిపెట్టిపోయినా ఏమీ కాదు. మా పార్టీని బలహీనపరచడం అయన తరం కాదు,” అని అన్నారు.
అయితే రేవంత్ రెడ్డి వెంట అనేకమంది తెదేపా నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే దానికి మొదట సంకేతం స్పష్టంగా కనబడింది. డిల్లీలో గల కర్నాటక భవన్ లో రేవంత్ రెడ్డి పేరిట మంగళవారం రోజుకు ఏకంగా 30 గదులు బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు జలవిహార్ లో తెదేపాలో తన స్నేహితులతో సమావేశం అనంతరం పార్టీలో ఎవరెవరు అయన వెంట కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే విషయంపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
రేవంత్ రెడ్డిని నాదెండ్ల భాస్కర్ రావుతో పోల్చి పార్టీకి వెన్నుపోటు పొడిచారని ఎల్ రమణ చెప్పడం బాగానే ఉంది. కానీ ఇటువంటి పోలికను ప్రస్తావించడం వలన చంద్రబాబు నాయుడు తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన విషయం కూడా ప్రస్తావనకు వస్తే తెదేపాయే ఇబ్బంది పడవచ్చునని గ్రహిస్తే మంచిది. ఇక రేవంత్ రెడ్డి పార్టీ వీడి వెళ్ళినా నష్టం లేదని ఎల్ రమణ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ, రేవంత్ వెంట బారీ సంఖ్యలో తెదేపా నేతలు, కార్యకర్తలు వెళ్ళిపోయినట్లయితే తెలంగాణాలో తెదేపా ఇక ఎన్నటికీ కోలుకోలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు తెరాస మద్య తెదేపా నలిగిపోయే ప్రమాదం కనబడుతోంది.