రేవంత్ కాంగ్రెస్ లో చేరుతున్నారు: కుంతియా

తెదేపా ప్రాధమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే  పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయన రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నారు. ఈ విషయం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ రామచంద్ర కుంతియా నిన్న హైదరాబాద్ లో మీడియాకు తెలిపారు. రేవంత్ రెడ్డితో బాటు మరికొంత మంది తెదేపా నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

తన రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్న సందర్భంగా రేవంత్ రెడ్డి, తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం కొడంగల్ లో గుడికి వెళ్లి పూజలు చేయించారు. అనంతరం తన నివాసం వద్దకు బారీ సంఖ్యలో చేరుకొన్న తన అనుచరులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, కొడంగల్ ప్రజలే తనకు హైకమాండ్ అని వారి అదేశానుసారమే వ్యవహరిస్తున్నానని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన స్నేహితులు (తెదేపా నేతలు)తో ఈరోజు హైదరాబాద్ జలవిహార్ లో సమావేశం అయ్యి వారి అభిప్రాయం కూడా తీసుకొని తన భవిష్య కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. రాష్ట్రానికి పట్టిన ‘గులాబీ చీడ’ను వదిలించేందుకే తను ఈ నిర్ణయం తీసుకొన్నానని తెలిపారు. ‘ఇదివరకు నన్ను తెరాస సర్కార్ అరెస్ట్ చేయించినప్పుడు నేను బెయిల్ పై బయటకు వచ్చినప్పుడే కేసీఆర్ ను గద్దె దించుతానని శపథం చేశాను. నేటి నుంచి అసలైన ఆట మొదలైంది,’ అని అన్నారు. 

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ రామచంద్ర కుంతియా నిన్న హైదరాబాద్ చేరుకొని పార్టీ ముఖ్యనేతలందరితో ఒక హోటల్ లో సమావేశం అయ్యారు. రేవంత్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవాలనేది అధిష్టానం నిర్ణయం గనుక ఎవరూ రేవంత్ రెడ్డిని వ్యతిరేకించవద్దని స్పష్టం చేశారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి మంగళవారం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఆయన ఎటువంటి ముదస్తూ షరతులు, డిమాండ్స్ పెట్టకుండానే పార్టీలో చేరుతున్నారు. ఆయన పనితీరు ఆధారంగానే సముచితమైన పదవులు లభిస్తాయి,” అని ప్రకటించారు.