తెదేపాకు రేవంత్ రెడ్డి రాజీనామా

టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం తెదేపాకు గుడ్ బై చెప్పేశారు. అయన పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈరోజు అమరావతిలో జరిగిన టిటిడిపి నేతల సమక్షంలోనే అయన తన రాజీనామా లేఖను తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేతికిచ్చారు. అయితే, సమావేశం తరువాత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు విలేఖరులడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెపుతూ రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ నాకు అందలేదని చెప్పడం విశేషం. 

రేవంత్ రెడ్డి తన మనసులో ఆవేదనను మాటల ద్వారానే కాకుండా తన రాజీనామా లేఖ ద్వారా కూడా పార్టీ అధినేతకు విస్పష్టంగా తెలియజేశారు. చంద్రబాబు నాయుడు కారణంగానే నేడు తనకు ఈ స్థాయి, గుర్తింపు లభించాయని అందుకు ఎప్పటికీ ఆయనకు, తెదేపాకు రుణపడిఉంటానని అన్నారు. తనకు తెదేపా, దాని కార్యకర్తలే ముఖ్యమని, వారిని కాపాడుకొనేందుకు విశ్వప్రయత్నం చేశానని తెలిపారు. తన వ్యతిరేకత కేసీఆర్ పైనే కానీ తెదేపాపై కాదని, కానీ పార్టీలో కొందరు సీనియర్ నేతలు తెర వెనుక కేసీఆర్ తో చేతులు కలిపి రాష్ట్రంలో పార్టీని భ్రష్టు పట్టించడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేశారని రేవంత్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. పార్టీని కాపాడుకోలేని స్థితిలో ఉన్నందునే తెదేపా నుంచి విడిపోతున్నానని రేవంత్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.