ఆర్య వైశ్యులను కించపరుస్తూ ‘కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు’ అనే పుస్తకం ప్రచురించిన ప్రొఫెసర్ కంచ ఐలయ్య శనివారం విజయవాడలో జరుగబోయే ‘సంఘీభావ సభ’లో పాల్గొనవలసి ఉంది. ఆయనను వ్యతిరేకిస్తున్న ఆర్యవైశ్యులు, ఇతర కుల సంఘాలు కూడా పోటీగా ‘ప్రతిఘటన సభ’ నిర్వహించడానికి సిద్దపడటంతో నగరంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని భావించిన ఏపి పోలీసులు రెండు సభలకు అనుమతి నిరాకరించారు. కానీ ఇరువర్గాలు సభలు నిర్వహించి తీరుతామని ప్రకటిస్తుండటంతో ముందస్తు జాగ్రత్త చర్యగా ఏపి పోలీసులు నిన్న హైదరాబాద్, తార్నాకలో కంచ ఐలయ్య నివాసానికి వెళ్ళి అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. అయనకు గృహనిర్బంధం విధిస్తున్నట్లు లేఖ ద్వారా తెలియజేశారు. ఆయన తన నివాసం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసినట్లయితే అరెస్ట్ చేస్తామని తెలిపారు.
దీనిపై ఆయన నిరసన తెలిపారు. ఆయనకు మద్దతుగా టీ-మాస్ ఫోరం సభ్యులు నేడు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని నిర్ణయించారు. ఏపి, తెలంగాణా ప్రభుత్వాలు కలిసి ఆయన గొంతును అణచివేయడానికి ప్రయత్నిస్తున్నాయని, కనుక ప్రజలు, మేధావులు, రాజకీయ పార్టీలు అందరూ వాటి దుశ్చర్యలను గట్టిగా ఖండించాలని టీ-మాస్ ఫోరం స్టీరింగ్ కమిటీ సభ్యులు గద్దర్, విమలక్క తదితరులు కోరారు.