రేవంత్ ఎపిసోడ్ సశేషం!

ఏపి సిఎం చంద్రబాబు నాయుడు తన విదేశీయాత్ర ముగించుకొని శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకొన్నారు. మొదట ఆయన నేరుగా రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ నరసింహన్ ను పరమార్శించారు. ఆ తరువాత లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో రేవంత్ రెడ్డితో సహా టిటిడిపి నేతలతో సమావేశమయ్యి, రేవంత్ రెడ్డి వ్యవహారంపై అందరి అభిప్రాయాలు, వాదనలు విన్నారు. అయితే వెంటనే ఎటువంటి నిర్ణయం ప్రకటించకుండా, మళ్ళీ రేపు అమరావతిలో మారోమారు అందరం సమావేశం అయ్యి ఈ సమస్యపై చర్చిద్దామని చెప్పారు. అంతవరకు ఎవరూ మీడియా ముందు ఈ వ్యవహారం గురించి మాట్లాడవద్దని సూచించారు. అమరావతిలో రేపు ఉదయం 10 గంటలకు మరొకసారి టిటిడిపి నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అవుతారు. 

ఈరోజు సమావేశంలో రేవంత్ రెడ్డి పార్టీలో తన సహచర నేతలపై వారి సమక్షంలోనే చంద్రబాబు నాయుడుకి పిర్యాదు చేయగా, వారు కూడా తిరిగి ఆయనపై పిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే సమావేశం అనంతరం టిటిడిపి నేత రేవూరి మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు అత్యవసరంగా అమరావతి వెళ్ళావలసి ఉంది కనుక ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి వ్యవహారంపై చర్చ జరుగలేదని, తెలంగాణాలో పార్టీ పరిస్థితి గురించి, పార్టీని బలోపేతం చేయడం గురించి చర్చించామని చెప్పుకోవడం విశేషం. కనుక ఈరోజు రేవంత్ రెడ్డి విషయం తాడోపేడో తేలిపోతుందనుకొంటే మరొకరోజుకు సాగుతోంది.