సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు...

తెలంగాణ భవన్ లో గురువారం జరిగిన తెరాస శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఒక శుభవార్త చెప్పారు. వచ్చే ఎన్నికలలో 99 శాతం సిటింగ్ ఎమ్మెల్యేలకే టికెట్స్ ఇస్తామని చెప్పారు. వారి ఎన్నికల ప్రచారానికి అవసరమైన డబ్బును కూడా చెక్ రూపంలో అందిస్తామని తెలిపారు. 

ఇక మరొక రెండు మూడు వారాల్లోనే రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల పెంపు గురించి ఖచ్చితమైన సమాచారం లభించబోతోందని కనుక మిగిలినవారు ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని చెప్పారు. పునర్వ్యస్థీకరణ ద్వారా మరో 34 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. కనుక పార్టీలో చేరిన కొత్తవారికి, మొదటి నుంచి తెరాసలో ఉన్నవారికీ అందరికీ టికెట్స్ లభిస్తాయని చెప్పారు. కాకపోతే కాస్త ముందూ వెనుకా అవుతాయి కనుక అందరూ కాస్త ఓపిక పట్టాలని చెప్పారు. 

ఎన్నికలకు మూడు నెలల ముందుగానే అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తామని చెప్పారు. అయితే టికెట్స్ కోసం తనపై ఒత్తిడి చేసేందుకు ఆశవాహులు ఎవరూ తమ నియోజకవర్గాల నుంచి తమ అనుచరులను వెంటబెట్టుకొని తెలంగాణా భవన్ వద్దకు రావద్దని కోరారు. వచ్చే ఎన్నికలలో కనీసం 96 స్థానాలలో ఖచ్చితంగా గెలువబోతున్నామని, గట్టిగా కృషి చేస్తే మరో 10 స్థానాలలో కూడా మనకే దక్కుతాయని కేసీఆర్ అన్నారు.