నేడు కాంగ్రెస్ ‘ఛలో అసెంబ్లీ’

కాంగ్రెస్ పార్టీ ఈరోజు ‘ఛలో అసెంబ్లీ’ పేరిట అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించడంలో తెరాస సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తునందుకు నిరసనగా ఈ కార్యక్రమం పెట్టుకొన్నారు. అయితే తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కాంగ్రెస్ నేతల వద్ద బలమైన అంశాలు ఏవీ లేనందునే వారు శాసనసభ సమావేశాలకు రాకుండా తప్పించుకొనేందుకు ఈ కార్యక్రమం పెట్టుకొన్నారని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఆ ముట్టడి కార్యక్రామాన్ని విరమించుకొని శాసనసభ సమావేశాలకు హాజరయ్యి రైతుల సమస్యలపై తమను ప్రశ్నించితే తగిన జవాబులు ఇవ్వడానికి తాము సిద్దంగా ఉన్నామని హరీష్ రావు చెప్పారు.

కానీ ‘ఛలో అసెంబ్లీ’ చేయబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించేసింది గనుక హరీష్ రావు మాట విని ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకొన్నట్లయితే, మళ్ళీ ఈ విషయంలో కూడా కాంగ్రెస్ పై తెరాస సర్కార్ పైచెయ్యి సాధించినట్లవుతుంది. కనుక కాంగ్రెస్ పార్టీ యధాప్రకారం ‘ఛలో అసెంబ్లీ’ పేరిట అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి సిద్దం అవుతోంది. 

కనుక ముందస్తు జాగ్రత్త చర్యలుగా పోలీసులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను, ద్వితీయశ్రేణి నేతలను అదుపులోకి తీసుకొంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన నల్లగొండ నియోజకవర్గం నుంచి బారీ సంఖ్యలో తన అనుచరులను, రైతులను హైదరాబాద్ తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు కనుక నల్లగొండ నుంచి హైదరాబాద్ చేరుకొనే అన్ని మార్గాలలో బారీగా పోలీసులను మొహరించి, తణికీలు నిర్వహించి అనుమానం వచ్చిన వారిని అదుపులో తీసుకొంటున్నారు. 

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈరోజు ఉదయం గాంధీ భవన్ లో సమావేశమవుతారు. అనంతరం అందరూ అక్కడి నుంచి నడుచుకొంటూ శాసనసభకు బయలుదేరుతారు. పోలీసులు వారిని మాత్రమే అనుమతించబోతున్నారు. వారితో బయలుదేరబోయే వారి అనుచరులందరినీ గాంధీ భవన్ వద్దే అడ్డుకోవడానికి పోలీసులు సిద్దంగా ఉన్నారు.